ఓ టెర్రరిస్ట్ జ్ఞాపకాలు..!
- ఇంటి దగ్గర నక్కి చాటుగా కన్నతల్లి గొంతు విన్నాడు
- చెల్లెలి సమాధి గుర్తించలేక శ్మశానం మొత్తం పుష్పగుచ్ఛాలతో నింపేశాడు
- తాను చదువుకున్న స్కూళ్ల దగ్గర తిరుగుతూ గత స్మృతులు జ్ఞాపకం చేసుకున్నాడు
- ఓ కరడుగట్టిన టెర్రరిస్ట్ జీవితంలోని మరో కోణం
హైదరాబాద్ :
2008లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న డైమండ్ మార్కెట్‌లో పేలుడు..
2014లో బెంగళూరులో చర్చ్ స్ట్రీట్‌లో ఉన్న 'కోకోనట్ గ్లోవ్' వద్ద విధ్వంసం..
అదే ఏడాది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గుహవాటి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో బ్లాస్ట్..
2015లో బెంగళూరులోని ఎంబీ రోడ్‌లో ఉన్న ఇజ్రాయిల్ వీసా సెంటర్‌కు నిప్పు..
2016లో తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసు అధికారిపై కత్తితో దాడి..
మూడు ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగిన 'ఆలమ్ జెబ్ ఆఫ్రిది' టెర్రర్ హిస్టరీలో మచ్చుతునకలివి. 'జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్' సంస్థ ముసుగులో దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు జనవరిలో హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో కీలకమైన నఫీజ్ ఖాన్‌కు 'బాంబుల ట్రైనర్' గానూ వ్యవహరించాడు.
ఇంతటి కరుడుగట్టిన ఉగ్రవాదిలోనూ సెంటిమెంట్ కోణం ఉంది. పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు, కన్నతల్లి, ఆత్మహత్య చేసుకున్న చెల్లి అంటే ఇతడికి ప్రాణం. దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలకు వాంటెడ్గా ఉండి, ఎనిమిదేళ్లుగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాది గతేడాది జనవరిలో స్వస్థలానికి వెళ్లి వచ్చాడు. డైమండ్ మార్కెట్ కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై అహ్మదాబాద్ తరలించిన క్రైమ్ బ్రాంచ్ గత నెల 21 నుంచి మంగళవారం వరకు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశాలపై 'సాక్షి' కథనం...
సంస్కృత భాషలో దిట్ట
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపుర న్యూ ఆషియానా పార్క్‌కు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది 1986 సెప్టెంబర్‌లో పుట్టాడు. పదో తరగతి వరకు జోహాపురలోని సన్‌ఫ్లవర్ స్కూలో చదివాడు. అక్కడ అరబిక్, ఉర్దూతో పాటు సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. సంస్కృత భాషపై మంచి పట్టు తెచ్చుకున్నాడు. 1993లో తండ్రి మసూకర్ అహ్మద్ ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లడం అఫ్రిది జీవితంలో వచ్చిన మొదటి కుదుపు. 11-12 తరగతులు వెజల్పూర్‌లోని ద రేన్ స్కూల్‌లో చదివినప్పటికీ 2004లో 12వ తరగతి ఫెయిలయ్యాడు. నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రచురించే పత్రిక తెహరీఖ్-ఏ-మిల్లత్ చదవటంతో పాటు కొందరి రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితుడైన ఆలమ్ జెబ్... తొలుత ఆ సంస్థలో సభ్యుడిగా మారాడు.
ఉగ్రశిక్షణలో 'ఉత్తముడు'
సిమికి చెందిన ఆరిఫ్ కాగ్జీ, జావేద్ షేక్, షంషుద్దీన్‌లతో సంబంధాలు ఏర్పడిన తర్వాత పూర్తిగా 'ఉగ్రబాట' లోకి వెళ్లిపోయాడు. వీరి ద్వారా సిమి చీఫ్‌గా వ్యవహరించిన సఫ్ధర్ నఘోరీ, అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్‌లకు దగ్గరయ్యాడు. 2007లో గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఉన్న హలోల్ లో జరిగిన సిమి ఉగ్రవాద శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆఫ్రిది.. మిగిలిన 30 మంది కంటే ఉత్తమమైన ప్రతిభ కనబరిచాడు. సిమి మాడ్యుల్‌తో పాటు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థలో చేరాడు.
అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో టెలిఫోన్ బూత్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా... ఐఎంకు చెందిన ఉగ్రవాది ఖయాముద్దీన్ కపాడియా రూ.6 వేలు ఇతడికి ఇచ్చి ఓ సైకిల్ కొనుక్కు రమ్మని చెప్పాడు. అలా తెచ్చిన సైకిల్‌పై బాంబు బిగించి, అఫ్రిదీ చేతనే డైమండ్ మార్కెట్ వద్ద పెట్టించాడు. 2008లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎం మాడ్యుల్ గుట్టు రట్టు కావడంతో అఫ్రిది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన విధ్వంసాలు కొనసాగించాడు.
సెలవు రోజు స్వస్థలంలో...
దాదాపు ఎనిమిదేళ్లుగా స్వస్థలానికి దూరంగా ఉన్న అఫ్రిదీకి తన ఊరు, ఇల్లు, తల్లి, చెల్లి సెంటిమెంట్ పోలేదు. దీంతో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునేందుకు గతేడాది అక్కడకు వెళ్లాడు. అయితే మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న తనను పట్టుకోవడానికి నిఘా, పోలీసు వర్గాలు నిత్యం వేటాడటంతో పాటు అనేకచోట్ల కన్నేసి ఉంటాయనే అనుమానంతో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. గుజరాత్‌లో సెలవు దినమైన 'ఉత్తరాయన్ డే' నేపథ్యంలో 2015 జనవరి 14న జోహాపురా వెళ్లాడు. న్యూ ఆషియానా పార్క్, సన్‌ఫ్లవర్ స్కూల్, వెజల్పూర్‌లోని స్కూళ్ల వద్ద సంచరిస్తూ నాటి స్మృతులు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ స్కూళ్ల ప్రహరీగోడల వద్దే చాలా సేపు గడిపాడు.
ఇంట్లోకి వెళ్తే తన కదలికల్ని ఏజెన్సీలు గుర్తించే అవకాశం ఉందని భయపడ్డాడు. దీంతో లోపలకు వెళ్లకుండా తన ఇంటి సమీపంలో తచ్చాడుతూ తల్లి గొంతు విన్నాడు. ఆపై అక్కడ నుంచి వెళ్లిపోయి.. 2008లో ఆత్మహత్య చేసుకున్న సోదరిని ఖననం చేసిన శ్మశానం వద్దకు వెళ్లాడు. అక్కడ తన చెల్లి సమాధి గుర్తించడం సాధ్యం కాకపోవడంతో భారీగా పుష్ఫగుచ్ఛాలు తీసుకుని దాదాపు అన్ని సమాధుల మీదా పెట్టాడు. ఆ పై తన షెల్టర్ జోన్ బెంగళూరు చేరుకున్నాడు. ఆఫ్రిదిని కస్టడీలోకి తీసుకుని విచారించిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.