‘షో’లు చెల్లవ్!
కేబుల్ నిర్వాహకుల నుంచి వినోద పన్ను వసూలుకు సిద్ధం
కొత్త ఆదాయ మార్గాల అన్వేషణలో జీహెచ్‌ఎంసీ
థియేటర్ల ఆక్యుపెన్సీపై దృష్టి
సంప్రదింపులతో వివాదాల పరిష్కారం
సిటీబ్యూరో: మీరు కేబుల్ ఆపరేటరా? కొన్నేళ్లుగా జీహెచ్‌ఎంసీకి వినోదపు పన్ను చెల్లించడం లేదా? మీరు ఎన్నాళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదో ఓ అంచనాకు రండి. అందుక వసరమైన మొత్తాన్ని సిద్ధం చేసుకోండి. ఇదంతా మేం చెబుతున్నది కాదు. ఆదాయం పెంచుకునే క్రమంలో జీహెచ్‌ఎంసీ ఇప్పుడు మీపై దృష్టి సారించింది. సినిమా థియేటర్ల నుంచీ భారీగా వసూలుకు రంగం సిద్ధం చేస్తోంది. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో వివిధ పన్నుల రూపంలో భారీగా ఆదాయం పెంచుకునే పనిలో పడింది. ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్స్ ఫీజులు, ప్రకటనల పన్నుల వంటి వాటి ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగింది. దీంతో పాటు కొంతకాలంగా వివిధ వర్గాల నుంచి రావలసిన బకాయిలనూ రాబట్టాలని నిర్ణయించింది.
థియేటర్లు...కేబుల్ ఆపరేటర్లపై దృష్టి
కొత్త ఆదాయ మార్గాలను వెదికే క్రమంలో గత కొంత కాలంగా ‘వదిలేసిన’ వినోద పన్నుపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. సినిమా థియేటర్ల నుంచి టిక్కెట్ల ధరలో 20 శాతం వినోదపు పన్నుగా కార్పొరేషన్‌కురావలసి ఉంది. చాలా థియేటర్ల యాజమాన్యాలు సరైన వివరాలివ్వకుండా.. తక్కువ ఆక్యుపెన్సీ చూపుతూ ఈ పన్నును ఎగ్గొడుతున్నాయి. దీని ద్వారా దాదాపు రూ.220 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరాలి. ప్రస్తుతం రూ.20 కోట్లే వస్తోంది. స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ వీటి లెక్క తేల్చే పనిలో పడ్డారు. థియేటర్లలో షో ప్రారంభమయ్యాక ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయో తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కేబుల్ ఆపరేటర్ల నుంచి కూడా వినోద పన్ను రావడం లేదని గుర్తించారు. జీహెచ్‌ఎంసీ కూడా ఈ అంశాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక్కో కనెక్షన్‌కు ఏడాదికి రూ.50 చొప్పున పన్ను విధించినా సుమారు రూ.6 కోట్లు రాగలవని అంచనాకు వచ్చారు. ఈ మొత్తం వసూలుకూ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఇతరత్రా పన్నులేమేం ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగాఐలాల పరిధిలోని భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటా వంటి వాటిపైనా దృష్టి సారించారు.
వీటన్నింటితో పాటు ఇప్పటి వరకు లెక్కించని భవనాలను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడంతో పాటు నివాస గృహాల కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తూ... వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించే పనిని ప్రారంభించారు. దీనిపై సర్వే చేస్తున్నారు. వీటితో పాటు ఆస్తిపన్నుకు సంబంధించిన కోర్టు వివాదాలను వీలైనంత మేరకు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే చర్యలకు సిద్ధమవుతున్నారు. సర్కిళ్ల వారీగా వివాదాల వివరాలు సేకరించి, సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులకు యోచిస్తున్నారు. కోర్టు వివాదాల్లోని దాదాపు 760 కేసుల ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.90 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ఈ వివాదాలు అబిడ్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ సర్కిళ్లలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
సర్కిళ్ల వారీగా వివాదాలు...
కాప్రా-3, ఉప్పల్-4, ఎల్‌బీనగర్-35, చార్మినార్(1)-19, చార్మినార్(2)-25, రాజేంద్రనగర్-23, ఖైరతాబాద్(1)-47, అబిడ్స్(1)-157, అబిడ్స్(2)-65, ఖైరతాబాద్(2)-142, శేరిలింగంపల్లి(1)-11, కూకట్‌పల్లి-82, కుత్బుల్లాపూర్-18, అల్వాల్-30, మల్కాజిగిరి-23, సికింద్రాబాద్-73. శేరిలింగంపల్లి(2), ఆర్‌సీపురం-పటాన్‌చెరు సర్కిళ్లలో ఎలాంటి వివాదాలు లేవు. ఇంకా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన వృత్తి పన్ను వాటా, వాహనాల పన్ను వాటాపైనా దృష్టి సారించారు. వీలైనన్ని మార్గాల ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవడం పైనే జీహెచ్‌ఎంసీ గురి పెట్టింది.