జల ‘ప్రవాహాల’ పేచీ! | The minimum flow is not always possible sayesTelangana | Sakshi
Sakshi News home page

జల ‘ప్రవాహాల’ పేచీ!

Published Mon, Feb 22 2016 3:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

జల ‘ప్రవాహాల’ పేచీ! - Sakshi

జల ‘ప్రవాహాల’ పేచీ!

♦ జల విద్యుత్ కేంద్రాల దిగువన కనీస ప్రవాహాలుండాలన్న గ్రీన్ ట్రిబ్యునల్
♦ పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశం
♦ కనీస ప్రవాహాలు ఎల్లప్పుడూ సాధ్యం కాదన్న తెలంగాణ..
♦ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోకుండా ఈ నిబంధనలు సరికాదన్న రాష్ట్రం.. ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు నిరంతరం ఉండేలా చూడాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు కొత్త చిచ్చును రేపేలా ఉన్నాయి. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కేంద్రాల దిగువన కనీసం 15 శాతం ప్రవాహాలు కొనసాగించాలని చేసిన సూచనను తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులు జీవ నదులు కావని, వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో అక్కడ ప్రవాహాలు  ఉండవని, అలాంటి సమయంలో నిరంతర ప్రవాహాల కొనసాగింపు సాధ్యం కాదని రాష్ట్రం స్పష్టం చేస్తోంది.

రాష్ట్ర వాదనపై గ్రీన్ ట్రిబ్యునల్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జల విద్యుత్ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించాలంటూ ట్రిబ్యునల్‌లో పుష్పాసేన్ అనే సామాజిక కార్యకర్త కేసు వేశారు. ఇందులో అన్ని రాష్ట్రాలనూ ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్, 2005లో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, అందులోని కనీస ప్రవాహాల మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. నదీ ప్రవాహంలో కనీసం 10 శాతం నీళ్లు నిరంతర ప్రవాహంగా ఉండాలని ఈ మార్గదర్శకాల్లో ఉంది. దాన్ని 15 శాతానికి పెంచుతూ గత జూలైలో సవరణ చేసింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాల అమలు రాష్ట్రంలోని ఎస్‌ఎల్‌బీసీ, జూరాల, నాగార్జునసాగర్, పోచంపాడు, నిజాంసాగర్, సింగూరు వంటి ప్రాజెక్టులపై పడనుంది. ఈ ప్రాజెక్టుల కింద ట్రిబ్యునల్ సూచనల అమలుపై ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర అభిప్రాయాలను చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసింది.

 నీటి లభ్యతే లేనప్పుడు ప్రవాహాలు ఎలా..
 రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న అంశాల మేరకు.. ‘గోదావరి, కృష్ణా నదుల కింద మొత్తం 9 జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ఇందులో 6 కృష్ణా పరిధిలో, 3 గోదావరి మీద ఉన్నాయి. ఇందులో పులిచింతల మినహా మిగతావి దశాబ్ద కాలానికి పైగా నడుస్తున్నాయి. అయితే పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సంబంధించిన చర్చల గురించి ఇప్పటివరకు ఏ విభాగం కూడా నీటిపారుదల శాఖ దృష్టికి తేలేదు’ అని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడా జీవ నదులు లేవని, వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో ప్రవాహాలు ఉండవంది. ‘గోదావరిలో 3 విద్యుత్ ప్రాజెక్టుల కింద మైళ్ల దూరం నది ఎండిపోయి ఉంటుంది.

రాష్ట్రంలో నీటి లభ్యత చాలా తక్కువ. 15 శాతం కనీస ప్రవాహాలు కొనసాగించడం సాధ్యం కాదు. ఒకవేళ కనీస ప్రవాహానికి 15 శాతం నీరిచ్చినా అవి ఇంకిపోతాయి తప్ప నిరంతర ప్రవాహం ఉండదు. అందువల్ల కనీస ప్రవాహాల కొనసాగింపు కష్టతరం’ అని పేర్కొంది. దీంతోపాటే కరువు రోజుల్లో రిజర్వాయర్లే నిండుకుంటున్నాయని, అలాంటప్పుడు ప్రవాహాల కొనసాగింపు సాధ్యమయ్యేదే కాదని తెలిపింది. పైగా జల విద్యుత్ కేంద్రాల కింద సాగు, తాగు అవసరాలకే నీటిని విడుదల చేయాలి తప్పితే, కనీస ప్రవాహాల కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండదని, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా ప్రవాహాలు ఉండాలన్న నిబంధన సరికాదని వివరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నాకే గ్రీన్ ట్రిబ్యునల్ ఓ నిర్ణయం చేసే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement