ఆటే.. హిట్టయింది
అత్తాకోడళ్ల మధ్య సంప్రదాయంగా మారిపోయినట్టు అనిపించిన నాటి గొడవలు దాదాపు అంతరించినట్టే. ఈ నేపథ్యంలో ఒకప్పటి అత్తా కోడళ్ల గిల్లికజ్జాలకు యూట్యూబ్‌లో యోధ వీడియోస్ కేరాఫ్ అయింది. ఈ వీడియోస్‌లో అత్తగారి అసలు పేరు రమ్య. కోడలి పేరు యోధ. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి చుట్టాలైపోయారీ సిటీ కిడ్స్. వయసును మించిన పరిణతితో అత్తాకోడళ్ల పాత్రలను పండిస్తున్న ఈ చిన్నారులు తమ సక్సెస్ అనుభూతులు పంచుకున్నారిలా.
..- చల్లపల్లి శిరీష
ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఫ్రెండ్ రమ్యతో అత్త కోడలు ఆట ఆడుకుంటుంటే మా నాన్న వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. మంచి రెస్పాన్స్ రావడంతో అలాగే వరుసగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాం. టైలర్ అయిన రమ్య వాళ్ల నాన్న మాకు కాస్ట్యుమ్స్ డిజైన్ చేస్తే, డ్యాన్సరైన మా నాన్న మేకప్ చేస్తారు. ఒక లైలా కోసం, సూర్యా వర్సెస్ సూర్యా, గోవిందుడు అందరివాడేలే, సుబ్రమణ్యం ఫర్ సేల్, బెంగాల్ టైగర్, గబ్బర్ సింగ్-2.. ఇలా 48 సినిమాల్లో నటించాను. ఈ వీడియోలతో చాలా పేరొచ్చింది.
- యోధ
నాలుగో తరగతి చదువుతున్నాను. సరదాగ ఆడుకున్న ఆటలే ఈ రోజు మాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మా టాలెంట్‌కు గుర్తింపుగా యూసుఫ్‌గూడలోని ఎస్‌జీబీ హైస్కూల్ ఉచితంగా చదువు చెబుతూ మాకు బాగా సపోర్ట్ చేస్తోంది. రాములమ్మ, సీతాకోక చిలుక, శశిరేఖ పరిణయం సీరియల్స్‌లో నటించాను. ఒక మంచి నటిగా సెటిలై మా తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనేది కోరిక.
- రమ్య