దుబాయ్ : తేదీ, జూన్ 7. సాయంత్రం ఐదు గంటలవుతోంది. లగ్జరీ బస్సు ఓ యాభైమంది ప్రయాణికులతో దూసుకెళ్తోంది. దాంట్లో భారత్, పాకిస్తాన్, దుబాయ్, ఇతర దేశాలకు చెందినవారున్నారు. కానీ, మరికొద్దిసేపట్లో వారి ప్రయాణం విషాదాంతమైంది. డ్రైవర్ నిర్లక్ష్యం పదిహేడుమంది ప్రాణాలను బలితీసుకుంది. భారీ వాహనాలు, బస్సులకు ఎంట్రీలేని దారిలో బస్సు తీసుకెళ్లడంతో.. రోడ్డుకు పైభాగంలో ఏర్పాటుచేసిన బారియర్‌ను ఆ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఎడమవైపున కూర్చున్న వారిలో 17 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 12 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్తానీలు, మరో ముగ్గురు ఇతర దేశాలకు చెందినవారున్నారు.
ఈ ఘటనపై దుబాయ్ ట్రాఫిక్ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రమాదానికి కారణమైన బారియర్‌కు, సూచిక బోర్డుకు మధ్య దూరం కేవలం 12 మీటర్లు మాత్రమే ఉందని డ్రైవర్ తరపు న్యాయవాది మహమ్మద్ అల్ తమీమి వాదించారు. ట్రాఫిక్ నియమాల ప్రకారం గంటకు 60 కిలోమీటర్ల వేగం అనుమతించే రోడ్లపై బారియర్‌లాంటివి ఏర్పాటు చేసినప్పుడు.. బారియర్‌కు సూచిక బోర్డుకు మధ్య కనీసం 60 మీటర్ల దూరం ఉండాలని కోర్టుకు తెలిపారు. సూచిక బోర్డు బారియర్‌కు అతి సమీపంలో ఏర్పాటు చేయడంవల్లే డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోయాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని వాదించారు.
గంటకు 94 కి.మీ వేగంతో..
అయితే, ఆ దారిలో స్పీడ్ లిమిట్ 40 మాత్రమేనని, కానీ ప్రమాద సమయంలో బస్సు 94 కి.మీ స్పీడ్‌తో వెళ్తోందని ట్రాఫిక్ అధికారులు కోర్టుకు విన్నవించారు. డ్రైవర్ అజాగ్రత్తవల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. డ్రైవర్ తరపున మరోన్యాయవాది మహమ్మద్ అల్ సబ్రి వాదనలు వినిపిస్తూ.. ఆర్టీఏ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బారియర్ ఉన్న ప్రదేశంలో సూచిక బోర్డును అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించి నిపుణుల రిపోర్టును కోర్టుకు అందించారు. ప్రమాద సమయంలో టైమ్ సాయంత్రం 5 గంటలవడంతో డ్రైవర్‌కు సూచికబోర్డు సరిగా కనిపించలేదని అన్నారు. తుదితీర్పు జూలై 11న వెలువడనుంది. డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment