హిల్లరీ వర్గీయులకు ఊహించని షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండడంతో హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు షాక్ తిన్నారు. గెలుపు దిశగా ట్రంప్ పయనిస్తుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. హిల్లరీ గెలుపుపై ముందు నుంచి దీమాగా ఉన్న ఆమె మద్దతుదారులు ఫలితాల సరళిని చూసి అవాక్కవుతున్నారు. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించడంతో హిల్లరీ వర్గీయులకు మింగుడు పడడం లేదు.
మేజిక్ ఫిగర్ కు ట్రంప్ చేరువవుతుండడంతో హిల్లరీ మద్దతుదారులకు టెన్షన్ పెరిగిపోతోంది. సర్వేలన్నీ హిల్లరీ గెలుస్తారని వెల్లడించడంతో కౌంటింగ్ ముందు దీమాగా ఉన్న డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఫలితాల సరళితో డీలా పడిపోయారు. విచారణ వదనాలతో కన్పిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ వర్గీయులు సంబరాలకు రెడీ అవుతున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.