వాజ్‌పేయి, ఇమ్రాన్ ఖాన్
లాహోర్ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంపై పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. ఆసియా దేశాల్లోనే వాజ్‌పేయి ఓ గొప్ప నేత అని ఇమ్రాన్ ఖాన్ కొనియాడారు. ఆయన మరణంతో దక్షిణాసియా ఓ మహానేతను కోల్పోయిందని పేర్కొన్నారు. భారత్-పాక్‌ల మధ్య రాజకీయంగా ఎన్ని సమస్యలున్నా ఆయన శాంతికోసం కృషి చేశారని, ఇదే ఆయనపై గౌరవాన్ని పెంచిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సత్సంబంధాల కోసం ఆయన పడ్డ తపన మరవలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు.
1999లో వాజ్‌పేయి ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించడమే కాకుండా స్వయంగా ప్రయాణించాడు. బస్సుయాత్రలో లాహోర్ వెళ్లి అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని, అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని, ఇరుదేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment