5, 6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకారం
- ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం
- భారత్–రష్యా 70 ఏళ్ల బంధం మరింత విస్తృతానికి కార్యాచరణ
- ఐదు ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు
- సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరు
సెయింట్ పీటర్స్‌బర్గ్: భారత–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా పలు కీలకాంశాలపై ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని మోదీ–రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించారు. మొదట వ్యూహాత్మక చర్చలు జరిపిన మోదీ–పుతిన్ ఆ తర్వాత ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు.
అనంతరం పలు అంశాలపై ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘21వ శతాబ్దపు దార్శనికత’ పేరుతో విజన్ డాక్యుమెంటును విడుదల చేశారు. పరస్పర గౌరవాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తృతం చేసుకోనున్నట్లు ఈ విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాలతోపాటు, అంతర్జాతీయ అంశాల్లోనూ భారత్–రష్యాలు ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ సిద్ధాంతంతో సంయుక్తంగా ముందుకెళ్తున్నాయని మోదీ చెప్పారు. ఈ ఏడాదితో భారత్–రష్యా సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి.
ఒకే ఆలోచనతో..: అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ తెలిపారు. ‘సంస్కృతి నుంచి భద్రత వరకు మా సంబంధాలపై ఒకే ఆలోచనతో ముందుకెళ్లనున్నాం. ఇందుకోసం కార్యాచరణనూ నిర్ణయించాం’ అని మోదీ వెల్లడించారు. భారత–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యమే రెండు గొప్ప దేశాల బంధం ప్రత్యేకత. రాజకీయ సంబంధాలు, భద్రత, వాణిజ్యం, ఆర్థిక, మిలటరీ, సాంకేతిక, విద్యుత్, సాంస్కృతిక, మానవ వనరులతోపాటు విదేశాంగ విధానంలోనూ మా బంధం మరింత విస్తృతం అవుతుంది’ అని దార్శనిక పత్రంలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంద్ర–2017 పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాలని కూడా మోదీ–పుతిన్ నిర్ణయించారు.
ఒక్కో యూనిట్ వెయ్యి మెగావాట్లు
జనరల్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ (జీఎఫ్‌ఏ)పై సంతకం కావటంతో కూడంకుళం అణుకేంద్రం 5, 6వ యూనిట్ల నిర్మాణానికి ఒప్పందం పూర్తయింది. ‘జీఎఫ్‌ఏకు ఆమోదాన్ని మేం స్వాగతిస్తున్నాం’ అని ఇరు దేశాధినేతలు దార్శనిక పత్రంలో పేర్కొన్నారు. భారత అణుశక్తి కార్పొరేషన్ (ఎన్‌పీసీఐఎల్), రష్యాకు చెందిన ఆటం స్టోరీ ఎక్స్‌పోర్ట్ (రష్యా న్యూక్లియర్ కాంప్లెక్స్ అనుబంధ సంస్థ) అణు రియాక్టర్ల నిర్మాణాన్ని చేపడతాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యి మెగావాట్లు.
ఉగ్రవాదంపై సంయుక్తంగా..
అన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని పక్కనపెట్టి.. ప్రపంచ భద్రతకు సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ సమాజానికి మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వనీతితో వ్యవహరించొద్దని సూచించారు. ఇటీవల యురోపియన్ యూనియన్ దేశాల్లో ఉగ్రదాడులు, ఉగ్రవాద ఛాయలు పెరుగుతున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎన్‌ఎస్‌జీ, ‘భద్రతామండలి’ కోసం మేమున్నాం
ఎన్‌ఎస్‌జీ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతుంటుందని పుతిన్ స్పష్టం చేశారు. బ్రిక్స్, డబ్ల్యూటీవో, జీ20 వంటి వేదికలపై భారత్‌లో కలిసిపనిచేస్తున్న రష్యా.. భవిష్యత్తులో మరిన్ని వేదికలపై భాగస్వామ్యాన్ని కొనసాగించనున్నట్లు తెలిపింది. ‘ఐక్యరాజ్యసమితిలో మరీ ముఖ్యంగా భద్రతామండలిలో సంస్కరణలు రావాల్సి అవసరం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు, సవాళ్లపై స్పందించేందుకు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలి. అణుసరఫరా బృందం, వాసెనార్ ఒప్పందం, భద్రతామండలిలో భారత సభ్యత్వానికి రష్యా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది’ అని దార్శనిక పత్రం పేర్కొంది. పౌరవిమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత్, ఐదుదేశాల యురేషియన్ ఎకనమిక్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చర్చలను మరింత త్వరగా ప్రారంభించాలని భారత్, రష్యా నిర్ణయించాయి.
ఎస్‌సీవోలో భారత్‌కు సభ్యత్వం!
వారం రోజుల్లోగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో భారత్‌కు సభ్యత్వం రాబోతోందని ఇరుదేశాల 70వ వార్షిక సదస్సు సందర్భంగా పుతిన్ స్పష్టం చేశారు. సదస్సుకు మోదీని ఆహ్వానించిన పుతిన్.. ‘ఇరుదేశాలు, ప్రజల మధ్య విశ్వాసం, స్నేహమే మా బలమైన బంధానికి నిదర్శనం’ అని అన్నారు. అంతర్జాతీయ అంశాల సహకారం విషయంలో భారత్‌కు తోడుగా ఉంటామన్నారు.
‘త్యాగాల కుటుంబం మీది’
రెండో ప్రపంచయుద్ధంలో లెనిన్‌గ్రాడ్ సందర్భంగా అమరులైన 5లక్షల మంది రష్యన్ల అంత్యక్రియలు జరిగిన పిస్కారియోవ్‌స్కోయ్ స్మారకాన్ని సందర్శించిన మోదీ అమరులకు నివాళులర్పించారు. ‘రష్యాకోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించే గొప్ప అవకాశం కలిగింది’ అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ కాస్త మనసువిప్పి మాట్లాడటంతో పుతిన్ భావోద్వేగానికి గురయ్యారు. ‘త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు మీరు’ అని పుతిన్‌ను ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. 70 ఏళ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో పుతిన్ సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. రష్యన్ ప్రజల గుండెల్లో ప్రత్యేక గుర్తింపున్న ఈ స్మారకాన్ని సందర్శించినందుకు మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. 1941–44 మధ్య లెనిన్‌గ్రాడ్ అనే పట్టణాన్ని నాజీ సేనలు దిగ్బంధించి 28 నెలలపాటు తిండి, నీరు కూడా అందకుండా చేయటంతో 5 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. ఈ సందర్భంగా జర్మన్లతో జరిగిన పోరాటంలో పుతిన్ ఐదుగురు చిన్నాన్నలతోపాటు తల్లి తరపు బంధువులు కూడా హతమయ్యారు.