వైరల్: హృదయాల్ని కదిలించే జుకర్ బర్గ్ పోస్ట్, ఫోటో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత మార్చిలో జారీచేసిన వివాదస్పదమైన ట్రావెల్ బ్యాన్ తెలిసిందే. ఆరు ముస్లిం దేశాల వలస ప్రజలను తమ దేశంలోకి రాకుండా ఈ నిషేధం విధించారు. ఈ వివాదస్పద నిర్ణయాన్ని సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నుంచి ఎలోన్ మస్క్ అందరూ దీనిపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ నిషేధం స్టేటస్ క్వోలో ఉంది. ఈ వివాదస్పద నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ట్రంప్ కు ఝలకిచ్చేలా శరణార్థులకు మద్దతుగా నిలిచేలా సోమాలియా శరణార్థులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జుకర్ బర్గ్ పాల్గొన్న తొలి ఇఫ్తార్ విందు ఇదే.
ఇఫ్తార్ విందులో వారితో షేర్ చేసుకున్న మధురమైన క్షణాల ఫోటోను జుకర్ బర్గ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్ని కదలించే పోస్టుతో పాటు షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. '' రంజాన్ ముగుస్తున్న సందర్భంలో ఎంతో అందమైన క్షణాలను అందించినందుకు నా అభిమానులకు కృతజ్ఞతలు. ఏమీ తెలియని ఓ కొత్త ప్రదేశంలో, కొత్త జీవితం ఏర్పాటుచేసుకోవడానికి మీరు చూపిస్తున్న తెగువ, నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఎందుకు ఈ దేశం ఎంతో గొప్పదైనదీ అంటే మీరే దానికి శక్తి'' అని పోస్టులో పేర్కొన్నారు. అంతేకాక అమెరికా గురించి వారి మనసులో ఉన్న భావనలను కూడా తెలుసుకున్నారు. 26 ఏళ్లుగా శరణార్థుల శిబిరంలో గడుపుతున్న ఓ వ్యక్తిని.. అమెరికాను సొంతిల్లుగా భావిస్తున్నావా అని జుకర్ ప్రశ్నించారు.
''ఇల్లు అనేదానికి నిర్వచనం.. ఇష్టమొచ్చినది చేయడానికి ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో అదే ఇల్లు. అలా ఆలోచిస్తే.. అమెరికా నాకు ఇల్లే'' అని ఆ శరణార్థి అన్నాడు. ఈ సమాధానానికి జుకర్ బర్గ్ ఎంతో మురిసిపోయారు'' అంతేకాక ఈ ప్రపంచంలో రెండే ప్రదేశాలు తమకు సౌకర్యంగా ఉంటాయని, వాటిలో ఒకటి మనం పుట్టిన దేశమైతే, మరొకటి మన భావాలను స్వేచ్ఛనిచ్చే దేశమని ఆ శరణార్థి చెప్పాడు. ఆ శరణార్థి అన్న మాటలు జుకర్ బర్గ్ ని ఆనందంలో ముంచెత్తాయి. దీన్నంతా జుకర్ బర్గ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. కాగ, ట్రంప్ నిషేధించిన ట్రావెల్ బ్యాన్ లో సోమాలియా కూడా ఒకటి.