రోగాలను గుర్తించే స్మార్ట్ గ్లోవ్స్
న్యూయార్క్: చలికాలం వచ్చిందంటే బయటకెళ్లేటప్పుడు సాక్సులు, గ్లౌవ్స్, షూ వేసుకోడం తప్పనిసరి. అయితే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కునాల్ మన్ కొండియా తయారు చేసిన సాక్సులు, షూలు, గ్లౌవ్స్ వేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీకేదైనా అనారోగ్య సమస్య ఉందా? అనే వివరాలు మీ వైద్యుడి వద్దకు గణాంకాలతోసహా వెళ్లిపోతాయి.
ఎందుకంటే ఈ స్మార్ట్ వస్త్రాలను సెన్సార్లను ఉపయోగించి తయారు చేశానని చెబుతున్నాడు కునాల్. ఇటువంటివి అందుబాటులోకి వస్తే మన ఆరోగ్యానికి సంబంధించి పదే పదే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ముందే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని కునాల్ చెబుతున్నాడు. ప్రస్తుతానికి తాను తయారుచేసిన సాక్సులు గుండె పనితీరును ఎప్పటికప్పుడు అంచనావేస్తూ.. వైద్యుడికి సమాచారం అందిస్తాయని, దీనివల్ల వైద్యుల నుంచి తగిన సూచనలు, సలహాలు మనకు అందుతూనే ఉంటాయన్నాడు.
భవిష్యత్తులో పెరాలసిస్, పార్కిన్సన్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించే స్మార్ట్ వస్త్రాలను తయారు చేస్తానని చెబుతున్నాడు. ఇవి అందుబాటులోకి వస్తే.. రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని కునాల్ భరోసా ఇస్తున్నాడు.