కన్నతల్లిని చంపేసిన కవల సోదరులు
దుబాయ్: ఉగ్రవాద సంస్థల్లో చేరొద్దన్నందుకు కన్నతల్లిని కవల సోదరులు హత్య చేసిన దారుణోదంతం సౌదీ అరేబియాలోని రియాద్ లో చోటు చేసుకుంది. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరొద్దన్నందుకు తల్లితో పాటు తండ్రి, సోదరుడిని నిందితులు హతమార్చేందుకు ప్రయత్నించారు. జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.
20 ఏళ్ల వయసు కలిగిన కవల సోదరులు ఖలీద్, సలేహ్ అల్-ఒరైనీ ఈ దురాగతానికి ఒడిగట్టారు. సిరియా వెళ్లి ఐసిస్ లో చేరతామని చెప్పగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో తల్లి హైలా(67)తో పాటు 73 ఏళ్ల వయసున్న తండ్రిని, 22 ఏళ్ల వయసున్న సోదరుడిపై కత్తితో దాడి చేశారు. తల్లి ప్రాణాలు కోల్పోగా.. తండ్రి, సోదరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఐసిఎస్ లో చేరొద్దన్నందుకు నిందితులు ఈ కిరాతకానికి ఒడిగట్టారని సౌదీ మీడియా వెల్లడించింది. సరిహద్దు దాటి యెమెన్ కు పారిపోతుండగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తమ దేశంలో ఐసిఎస్ సానుభూతిపరుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని కుటుంబ సభ్యులను హత్య చేసిన ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఐదు జరిగాయని 'అక్బర్ 24' వెబ్సైట్ వెల్లడించింది.