డమాస్కస్: రసాయన ఆయుధాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వివరాలను రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (ఓపీసీడబ్ల్యూ)కు అందజేసిన సిరియా.. శనివారం మిగతా వివరాలను కూడా ఆ సంస్థకు సమర్పించింది. ఈ సమాచారాన్ని సాంకేతిక సచివాలయం సమీక్షిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆగస్టు 21న జరిగిన రసాయన ఆయుధ దాడి అనంతరం.. ఆ దేశంపై దాడిచేస్తామని అమెరికా హెచ్చరించటం.. అనంతర పరిణామాల్లో సిరియాపై దాడిని నివారించేందుకు సిరియా మిత్రదేశమైన రష్యా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటం తెలిసిందే. ఆ ఒప్పందం ప్రకారం సిరియా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాలను మొత్తం ధ్వంసం చేసేందుకు వాటి వివరాలను అంతర్జాతీయ సంస్థ అయిన ఓపీసీడబ్ల్యూకు శనివారంలోగా అప్పగించాల్సి ఉంది.