ఆనందంలో అట్టడుగున..!
సంతోష సూచిలో 121వ స్థానంలో భారత్
⇒ తొలిస్థానంలో నార్వే
⇒ ఐరాస నివేదికలో వెల్లడి
ఐక్యరాజ్యసమితి: భారతీయుల కంటే పాకిస్తానీయులే ఎక్కువ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు.. మన కంటే ఇరాక్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశ వాసులే అధిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా సంతోషకర దేశాల జాబితాలో భారత్ 121వ స్థానానికి పరిమితమై అట్టడుగున నిలిచింది. ‘ప్రపంచ సంతోషకర దేశాల నివేదిక 2017’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా సోమవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 155 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. 2014–15 నివేదిక ప్రకారం భారత్ స్థానం 118 కాగా.. ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు. వ్యక్తిగత అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని ఈ నివేదిక వెల్లడించింది.
డెన్మార్క్‌ను వెనక్కినెట్టి...
ప్రపంచంలో అంత్యంత సంతోషకర దేశంగా నార్వే నిలిచింది. గతేడాది కంటే మూడు స్థానాలు ఎగబాకి నార్వే ఈ ఘనత సాధించింది. మూడేళ్లుగా నంబర్‌వన్‌గా కొనసాగుతున్న డెన్మార్క్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. చైనా (79), పాకిస్తాన్ (80), నేపాల్ (99), బంగ్లాదేశ్ (110), ఇరాక్ (117), శ్రీలంక (120) స్థానాల్లో నిలిచా యి. నార్వే, డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఐస్‌లాం డ్, స్విట్జర్లాండ్, ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ ఉన్నాయి. గతేడాది కంటే ఒక స్థానం తగ్గి అమెరికా 14వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఇంతవరకూ ఐదుసార్లు ఈ నివేదికల్ని విడుదల చేశారు.