సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టుది చరిత్రలో నభూతో నభవిష్యతని, రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ ప్రాజెక్టు ఓ అద్భుత ప్రాజెక్టు అని గవర్నర్ ఈఎల్ నరసింహన్ కితాబిచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికితోడు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, తాగునీరు కూడా అందుతుందని పేర్కొన్నారు. మంత్రి టి.హరీశ్‌రావుతో కలిసి గవర్నర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శనివారం పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి నుంచి మొదలుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ అండర్‌టన్నెల్, సర్జిపూల్ పనుల వరకు పరిశీలన సాగింది.
ఈ సందర్భంగా లక్ష్మీపూర్‌లో ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారని, అది చూసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా..? కలల చంద్రశేఖర్ రావా.. అనిపించిందని, ప్రాజెక్టును చూసిన తర్వాత తన అభిప్రాయం మారిందన్నారు. కేసీఆర్ కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా మారిపోయరని అనిపిస్తోందన్నారు. అహర్నిషలు ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావు పేరు కూడా కాళేశ్వర్‌రావుగా చరిత్రకెక్కుతుందని కితాబిచ్చారు.
పనులు చూసి పరేషాన్ అవుతున్నా..
‘ప్రాజెక్టు ప్రతిభాగాన్ని పరిశీలించా.. దేనికదే అద్భుతం.. పనులను చూసి పరేషాన్ అవుతున్నా’ అని గవర్నర్ పేర్కొన్నారు. ప్యాకేజీ–6లో ఏకంగా గోదావరినే అంతర్వాహినిగా పట్టుకొచ్చారని, సర్జ్‌పూల్ చూసినప్పుడు అదొక ఇంజినీరింగ్ అద్భుతం అనిపించిందన్నారు. ఇంతకాలం సరస్వతి నది మాత్రమే గుప్తనదిగా ఉండేదని, ఇప్పుడు గోదావరినీ గుప్తనదిగా మార్చారని కితాబిచ్చారు. జూన్ నాటికి మొదటిదశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మ్యాపుల ద్వారానే కాళేశ్వరం గురించి తెలుసుకున్నానని, క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
టీమ్‌వర్క్‌తో మహాయజ్ఞంలా పనులు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, జోషి ముగ్గురూ టీమ్ వర్క్‌లా నిత్యం సమీక్ష చేయడం వల్లే ప్రాజెక్టు పనులు మహాయజ్ఞంలా సాగుతున్నాయని అన్నారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో ఉపాధి కలుగుతోందని, వారితోనూ మాట్లాడానని గవర్నర చెప్పారు. వాళ్లెలా ఉంటున్నారు..? ఎక్కడ ఉంటున్నారు..? భోజనం, వసతి ఎలా ఉంది..? వైద్యం అందుతుందా? ప్రావిడెంట్ ఫండ్ పరిస్థితి ఇలా.. అన్నింటిపై ఆరా తీశానని, వారు సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. మంత్రి హరీష్‌రావు తనువంతా కాళేశ్వరం ప్రాజెక్టేనని, అడుగు తీసి అడుగువేస్తే ఆయన ధ్యాసంతా కాళేశ్వరం తప్ప మరోమాట లేదన్నారు. ఆయన దేహమంతా కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండిపోయిందన్న నరసింహన్, హరీశ్‌రావును కాళేశ్వర్‌రావు అని పిలిస్తే బాగుంటుందన్నారు. ఈ ప్రాజెక్టులో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి చాలా జోష్‌గా పని చేస్తున్నారని, ఆయన పనితీరు కూడా బాగుందన్నారు.
గవర్నర్ పర్యటన సక్సెస్..ఊపిరి పీల్చుకున్న అధికారులు
భూపాలపల్లి జయశంకర్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్ దంపతులు మంత్రి హరీశ్‌రావుతో కలిసి సుమారు ఎనిమిది గంటల పాటు పరిశీలించారు. శనివారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలానరసింహన్ కాళేశ్వరం ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కన్నెపల్లి ప్రాంతానికి చేరుకుని పనులు పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ ప్రాంతాన్ని హెలికాప్టర్ నుంచే తిలకించారు. అన్నారం బ్యారేజీ, పంపుహౌస్‌లను సందర్శించారు. సుందిళ్ల, నందిమేడారం అండర్‌టన్నెల్, పంపుహౌస్ పనులు, రామడుగు మండలం లక్ష్మీపూర్ అండర్‌టన్నెల్, సర్జిపూల్ పనులను పరిశీలించారు. లక్ష్మీపూర్ సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టు అండర్ టన్నెల్, సర్జిపూల్ పనులు సాగుతున్న తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రాజెక్టుబాట ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గవర్నర్ దంపతులకు వెండి నెమళ్లు
గవర్నర్ దంపతులకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు వెండి నెమళ్ల జ్ఞాపికలను బహూకరించారు. సుందిళ్ల బ్యారేజీ, పంప్ హౌస్ పనుల పరిశీలన అనంతరం, హెలికాప్టర్ ద్వారా రామగుండం మండలం గోలివాడ, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధర్మా రం మండలం మేడారం టన్నెల్ పనుల తీరును చూశారు. అక్కడి నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో సొరంగమార్గాన్ని పరిశీలించారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే.జోషి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, ఎ.శ్రీదేవసేన, కరీంనగర్, రామగుండం కమిషనర్లు వీబీ.కమలాసన్ రెడ్డి, దుగ్గల్, మంత్రి హరీశ్ వ్యక్తిగత కార్యదర్శి కోరెం అశోక్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి ఉన్నారు.
ప్రాజెక్టుల వద్దే మంత్రి హరీశ్... అర్ధరాత్రి ధర్మారం వద్ద సమీక్ష
గవర్నర్ దంపతులకు హైదరాబాద్ ప్రయాణం అయ్యాక రామడుగులో అధికారులతో సమీక్షించిన మంత్రి హరీష్‌రావు, అక్కడి నుంచి ధర్మారం టన్నెల్ వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనుల ప్రగతిపై అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు. ఆదివారం సైతం ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment