15 నెలలు... 33 స్టూడియోలు!
రాజమౌళి సృష్టించిన ఊహాలోకం మాహిష్మతి సామ్రాజ్యంలో మూడున్నరేళ్లు బందీగా ఉన్న ప్రభాస్‌కి కొత్త ఏడాది ప్రారంభంలో విముక్తి లభించింది. అదేనండీ... ‘బాహుబలి–2’కి గుమ్మడికాయ కొట్టేశారు కదా! ఈ నెల 6తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. కెమేరాలకు ప్యాకప్ చెప్పేశారు. అంతవరకూ బాగుంది. మరి, ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్ 28న సినిమా విడుదల చేస్తారా? లేదా? అనే డౌట్ కొందరిలో ఉంది. ఎందుకంటే... సకాలంలో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతో ‘బాహుబలి’ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి విడుదల చేయలేకపోయారు.
ఇప్పుడూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? అనే డౌట్స్ రావడం సహజమే కదా! ఈ డౌట్‌లకు ‘బాహుబలి–2’ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ కమల్‌కణ్ణన్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ‘‘పదిహేను నెలలుగా అల్మోస్ట్ ఇండియాలోని మేజర్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలలో ‘బాహుబలి: ద కంక్లూజన్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 33 కంటే ఎక్కువ స్టూడియోలు ‘బాహుబలి–2’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. మా అందరి లక్ష్యం ఒక్కటే... విడుదల దిశగా దూసుకువెళ్తున్నాం’’ అని కమల్‌కణ్ణన్ పేర్కొన్నారు. దీన్నిబట్టి చెప్పిన తేదీకే సినిమా వస్తుందని ఊహించవచ్చు!!