బాక్సాఫీస్ కింగ్
రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కొత్త అనుభూతిని మిగిల్చింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా.. ఇలా అందరూ తమ నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా మాత్రం ఇప్పటివరకూ మిగతా సినిమాలు సాధించిన రికార్డులను చెరిపేసింది. భారతీయ సినిమాల్లో ‘కలక్షన్ కింగ్’ అనిపించుకుంది ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’. మొదటి భాగం (‘బాహుబలి: ది బిగినింగ్) దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేయగా రెండో భాగం అంతకు రెండింతలు పైనే వసూలు చేస్తుందని విశ్లేషకుల అంచనా. అందుకు నిదర్శనం ఈ చిత్రం ఆరో రోజు వసూళ్లు. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లల్లో నంబర్ వన్‌గా నిలిచిన భారతీయ సినిమా ‘పీకే’ (హిందీ) రికార్డ్‌ను ‘బాహుబలి–2’ బద్దలు కొట్టింది. ‘పీకే’ మొత్తం వసూళ్లు 743 కోట్ల రూపాయలు.
‘బాహుబలి’ ఆరో రోజుకే ఆ వసూళ్లను దాటేసింది. విడుదలైన అన్ని భాషలతో కలుపుకుని ఈ చిత్రం సిక్త్స్ డేకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 792 కోట్లు వసూలు చేసింది. మామూలుగా క్రేజీ ప్రాజెక్ట్‌కి మొదటి వారం టికెట్స్ దొరకవు. అయితే ‘బాహుబలి–2’కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండో వారానికి ఎంటరవుతున్నప్పటికీ టికెట్స్ సులువుగా దొరికే పరిస్థితి లేదు. దీన్నిబట్టి భవిష్యత్ వసూళ్లను ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పది రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు. భారతీయ సినిమాల్లో మార్కెట్ పరంగా నంబర్ వన్ స్థానం హిందీ చిత్రాలదైతే ఇప్పుడా స్థానాన్ని ‘బాహుబలి’ దక్కించుకుంది. 1,000 నుంచి 1,500 కోట్లు ఫైనల్ కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ రికార్డ్‌ని సమీప కాలంలో ఏ భారతీయ సినిమా అధిగమించలేదని అంటున్నారు. మరి.. ‘బాహుబలి’ రికార్డ్‌ను ఏ సినిమా అధిగమిస్తుందో వేచి చూడాలి.