భారతీయ సినిమా అంటే బాహుబలి అనే స్థాయికి తీసుకెళ్లాం! | ss rajamouli explain bahubali things | Sakshi
Sakshi News home page

భారతీయ సినిమా అంటే బాహుబలి అనే స్థాయికి తీసుకెళ్లాం!

Published Wed, Apr 26 2017 11:36 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

భారతీయ సినిమా అంటే బాహుబలి అనే స్థాయికి తీసుకెళ్లాం! - Sakshi

భారతీయ సినిమా అంటే బాహుబలి అనే స్థాయికి తీసుకెళ్లాం!

‘‘ఏ దర్శకుడూ తను ఊహించినట్టు, ఊహలకు అనుగుణంగా సినిమా తీయలేడు. మనసులో ఉన్నదాన్ని వంద శాతం తెరపై ఆవిష్కరించడం అసాధ్యం. కానీ, ఓ కథకుడిగా ‘బాహుబలి’ నాకెంతో సంతృప్తి ఇచ్చింది. ఇంతకుముందు నా సినిమా కథల్లో హీరో పాత్ర మాత్రమే బలంగా ఉండేది.కానీ ఈ సినిమాలో ఒక్కటి కాదు... ఏడు పాత్రలు ఎంతో శక్తిమంతంగా ఉంటాయి. నాకు నచ్చిన హీరోయిజాన్ని తెరపై చూపించా. నా ఊహలను మాగ్జిమమ్‌ ఆవిష్కరించిన సినిమా ‘బాహుబలి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మించిన ‘బాహుబలి–2’ రేపు రిలీజవుతోంది.  రాజమౌళి చెప్పిన సంగతులు....

ఓ సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందులో పాత్రలను మర్చిపోలేక పోతే అది మంచి సినిమా. ‘బాహుబలి’ విడుదలైన ఇన్ని నెలల తర్వాత కూడా ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే నాన్నగారు సృష్టించిన శక్తిమంతమైన పాత్రలే కారణం. ‘బాహుబలి’ విజయంలో సింహభాగం పాత్రలకే ఇస్తాను. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడో శుక్రవారం అందరికీ తెలుస్తుంది. సస్పెన్స్‌ వల్ల సినిమా ఆడదు. అందులోని డ్రామా వల్లే ఆడుతుంది.

అసలు మొదటి భాగాన్ని కట్టప్ప ప్రశ్నతో ముగించాలనుకోలేదు. సినిమాకు మంచి ముగింపు కావాలి. అందులో కన్న కొడుకును కాదని అమరేంద్ర బాహుబలిని రాజును చేస్తుంది శివగామి. ఆమె ఎందుకు చేసిందో కూడా చెబుతుంది. ప్రజలంతా బాహుబలికి జయహారతులు పట్టారు. అక్కడితో ముగిస్తే సరిపోతుందనుకున్నా. కానీ, ఫ్లా్యష్‌బ్యాక్‌లో చెప్పిన కొన్ని పాత్రలున్నాయి. వాటిని అర్ధాంతరంగా వదిలేయకూడదు. వాళ్లను సాదాసీదాగా చూపించకుండా ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నతో ముగిస్తే మంచి ట్విస్ట్‌ అవుతుందనుకున్నాం. అది ఆటమ్‌బాంబులా పేలుతుందని ఊహించలేదు.

మేం మార్కెటింగ్‌ స్ట్రాటజీ ఫాలో అయ్యామనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఓ సినిమాను అసంపూర్తిగా ముగించడం మనకు కొత్త. కానీ, హాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఈ పద్ధతి ఉంది. అందువల్ల, ‘బాహుబలి’ని రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్నప్పుడు నాకెలాంటి డౌట్స్‌ రాలేదు. నిజం చెప్పాలంటే రెండు భాగాలుగా తీయాలనుకో లేదు. షూటింగ్‌ మొత్తం పూర్తి కాకముందే మా దగ్గర డబ్బులు అయిపోయాయి. అప్పుడు మొదటి భాగం విడుదల చేసిన ఓ నాలుగైదు నెలలకు ‘బాహుబలి–2’ విడుదల చేయాలనుకున్నాం. ఇన్నాళ్లు పట్టింది. నా దృష్టిలో కథ వేరు, కథనం వేరు, వాణిజ్య హంగులు వేరు. దర్శకుడిగా ప్రేక్షకులకు కావలసినవన్నీ ఇవ్వడం నా బాధ్యత. ఇందులో అన్నీ ఉన్నాయి.

సీజీ వర్క్స్‌ వల్ల నా ప్రతి సినిమా అనుకున్న టైమ్‌ కంటే కాస్త ఆలస్యమవుతుంది. ‘బాహుబలి–2’కి వచ్చేసరికి సీజీ వర్క్స్‌ ఉన్న షాట్స్‌ అన్నీ గతేడాది అక్టోబర్‌లో చిత్రీకరించేశాం. మా నిర్మాత శోభు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఇది సాధ్యమైంది. ఓ నెల రోజుల ముందు శోభుగారితో మరో రెండు వారాలు వాయిదా వేద్దామా? అనడిగా. ఆయన నవ్వేసి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయన్నారు.

చిన్న వయసులో ‘మాయాబజార్‌’ చూశా. దర్శకుణ్ణి అయ్యాక అప్పట్లోనే అంత గొప్ప సీన్లు ఎలా తీశారా? అని ఆలోచించా. రెండు నిమిషాల పాటలో పాత్రలన్నిటినీ పరిచయం చేశారు. గ్రాఫిక్స్‌ కూడా అద్భుతం. కేవీ రెడ్డిగారికి హ్యాట్సాఫ్‌.

‘బాహుబలి’ రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పడుతుందని ముందే ఊహించి ఉంటే సినిమా చేసేవాణ్ణి కాదు. ఒక్కసారి దిగిన తర్వాత ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తిరిగి చూడటానికి ఏముంటుంది? ఓ సినిమాకు పని చేస్తున్నంత సేపూ ఓ ఉత్సాహం ఉంటుంది. పని పూర్తయిన తర్వాత టెన్షన్‌ స్టార్ట్‌ అవుతుంది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతోంది. అందుకే, నాకిప్పుడు టెన్షన్‌గా ఉంది.

మా నిర్మాతలు నాపై నమ్మకంతో జీవితాలను పణంగా పెట్టి ఖర్చుపెట్టారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఏయే పనులు చేశారో అందరికీ తెలుసు. నేను నా కలను సాకారం చేసుకునే క్రమంలో వాళ్లంతా నన్ను కాపాడుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ అయితే... ‘నీ లెవల్‌ ఇది కాదు. నువ్వింకా చేయగలవ్‌’ అని ఎంతో ఎనర్జీ ఇచ్చాడు.

దర్శకుడిగా నా లక్ష్యాలను ఎప్పుడో చేరుకున్నా. మహాభారతం తీయాలనుందని చాలా రోజుల నుంచి చెబుతున్నా. కానీ, ఓ పదేళ్ల వరకూ దాన్ని టచ్‌ చేయను. మహాభారతం తీసేంత స్కిల్స్‌ నాలో లేవు. ∙బయట దేశాలవారికి తెలుగు, తమిళ, దక్షిణాది సినిమాల గురించి అస్సలు తెలీదు. భారతీయ సినిమా గురించి పెద్దగా తెలీదు. ఒకవేళ హిందీ సినిమాల గురించి తెలిసినా... షారుక్‌ఖాన్‌ అంటుంటారు. అటువంటి స్థాయి నుంచి భారతీయ సినిమా అంటే ‘బాహుబలి’ అనే స్థాయికి తీసుకురాగలిగాం. ఇది నాకెంతో గర్వంగా అనిపించింది. సినిమా అంత పెద్ద హిట్టయితే ఎవరికైనా గర్వం ఉంటుంది. అయితే... ఇంట్లో మా ఆవిడ, మా వదిన క్లాస్‌ పీకి నా గర్వానికి బ్రేకులు వేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement