హీరోగా నా వందో సినిమా నేనే డెరైక్ట్ చేసుకుంటాను!- సుమన్ పుట్టినరోజు
హీరోగా నా వందో సినిమా నేనే డెరైక్ట్ చేసుకుంటాను!- సుమన్ పుట్టినరోజు
Published Wed, Aug 28 2013 12:59 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
సుమన్‌కి అన్నీ గాయాలే. మనిషికీ మనసుకీ కూడా. లక్షల ఉలిదెబ్బలు తగిలితేకానీ శిల శిల్పం కాదు. అలా విధి అనే శిల్పి చెక్కిన చక్కని శిల్పం అయన. ఇప్పటికీ ఆ శిల్పం స్ట్రాంగ్‌గానే ఉంది. ఇంకా ఎన్నో వండర్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా సుమన్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ ఇది.
**** ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి సార్?
ఇక్కడ పుట్టినరోజు జరుపుకొని ఎర్లీ అవర్‌లో అమెరికా వెళుతున్నాను. సరిగ్గా ఇదే తేదీన అక్కడకు చేరుకుంటా.
**** స్టార్‌గా ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు నటునిగా కెరీర్ సాగిస్తున్నారు. తేడా ఎలా ఉంది?
సినీ పరిశ్రమ నాకు ఊహించినదానికంటే ఎక్కువే ఇచ్చింది. నటునిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాన్నేను. 35 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం నాది. అయితే... ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ పర్మినెంట్ కాదు. అది కాస్త దూరంగా ఉన్నప్పుడే జీవితం విలువ తెలిసేది. దానికి ఉదాహరణ నా జీవితమే. అసలు నా లైఫే ఓ మిరాకిల్.
**** మీరు ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు ఏ నటుడూ ఎదుర్కొలేదేమో కదా?
ఎన్ని కష్టాలు పడ్డామన్నది ముఖ్యం కాదు. ఏం సాధించాం అనేది ఇక్కడ ముఖ్యం. ఆ రకంగా చూసుకుంటే చాలా సాధించాన్నేను. ఏ నేపథ్యం లేకుండా హీరో అయ్యాను. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించాను. ఫ్యామిలీ హీరోగా కెరీర్ ప్రారంభించి, యాక్షన్ హీరోగా తెరపై కొత్త వరవడి సృష్టించాను. అనుకోకుండా మైథలాజికల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాను. వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, సత్యనారాయణస్వామి, శివుడు, బ్రహ్మ, మహావిష్ణువు ఇలా పలు పురాణ పాత్రల్లో నటించాను. ఇవన్నీ దేవుడిచ్చిన వరాలే కదా. చాలు చాలు అన్నా చాలా ఇచ్చాడు నాకా దేవుడు.
**** మీ జీవితంలో గొప్ప ఆనందాన్నిచ్చిన సంఘటన?
‘అన్నమయ్య’ సినిమాను నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మగారితో కలిసి చూడటం. అలాగే... నా మిత్రుడు రజనీకాంత్, దర్శకుడు శంకర్ అడగడంతో ‘శివాజీ’ చిత్రంలో విలన్‌గా నటించాను. ప్రపంచం మొత్తం ఈ రోజు నన్ను గుర్తు పడుతోందంటే కారణం ‘శివాజి’. రజనీతో గంట గడిపితే చాలు అనుకునేవారు కోకొల్లలు. కానీ నేను తనతో ఏకంగా పది నెలలు స్పెండ్ చేశాను. తమిళంలో విజయ్, అజిత్, కార్తీల సినిమాల్లో విలన్‌గా నటించాను. త్వరలో తెలుగులో విలన్‌గా కనిపించబోతున్నాను.
**** నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటున్నారు?
దర్శకత్వం చేస్తే... అది గుర్తుండిపోయేలా ఉండాలి. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. సందేశాల జోలికి పోకుండా... మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాలని ఉంది. ఆ సినిమాలో హీరోగా కూడా నేనే చేస్తా. ఎందుకంటే... ఇప్పటికి తెలుగులో 99 సినిమాల్లో హీరోగా చేశా. దీంతో వంద కంప్లీట్ అవుతుంది.
**** యాక్షన్ హీరోగా ట్రెండ్ క్రియేట్ చేసిన మీకు... ఇప్పటి హీరోల యాక్షన్ చూస్తే ఎలా అనిపిస్తుంది?
ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపించడం ఇప్పుడు ఎక్కువైంది. అయితే అది వాళ్ల తప్పు కాదు. అయినా అందరూ బాగా చేస్తున్నారు. మా రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. చాలాసార్లు కాళ్లూ చేతులూ విరగ్గొట్టుకున్నాన్నేను. అప్పట్లో రెండ్రోజుల్లో ఫైట్ తీసేసేవారు. క్లైమాక్స్ అయితే... మూడు రోజులే. ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు. వీళ్లకు కావాల్సినంత టైమ్ ఉంటుంది. పైగా గ్రాఫిక్స్ వీళ్లకు కొండంత బలం. ఆ రోజుల్లో నేను చేసిన ‘కంచుకవచం’ చిత్రానికి దేశంలో పేరెన్నికగన్న ఫైట్ మాస్టర్లు పనిచేశారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఆ సినిమాలో పోరాటాలు ఉంటాయి. అలాంటి సినిమా ఈ పరిస్థితుల్లో తీయడం కష్టమే.
**** ఇంకా చేయాలనుకుంటున్న పాత్రలు?
లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయుడు పాత్రలు చేయాలని ఉంది. ఎందుకంటే వారిపై ఎన్నో ఉపకథలున్నాయి. అలాగే, ఛత్రపతి శివాజీ, సుభాష్‌చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు పాత్రలు కూడా చేయాలనుంది.
**** తెలుగులో విలన్‌గా చేస్తున్నానని ఇంతకు ముందు చెప్పారు. ఏ సినిమా?
‘రుద్రమదేవి’లో విలన్‌గా చేస్తున్నాను. నా పాత్ర పేరు ‘హరహరమహాదేవుడు’. చాలా శక్తిమంతమైన పాత్ర. గుణశేఖర్ కోసం ఒప్పుకున్నాను.
Advertisement