కన్నీళ్లు పెట్టిన దర్శక-నిర్మాత
ముంబై: షారూఖ్ ఖాన్ ప్రశంసకు దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాను దర్శకత్వం 'యే దిల్ హై ముష్కిల్' సినిమా మ్యూజిక్ చాలా బాగుందని షారూక్ మెచ్చుకున్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపాడు. ఆయన ప్రశంస తనకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు.
'షారూఖ్ ఖాన్ అలా చెప్పడం ఆయన గొప్పతనం. ఈ సినిమా, మ్యూజిక్ ఎలా ఉంటుందోనని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సంగీతం బాగుందని షారూఖ్ ప్రశంసించడం ఉత్సాహానిచ్చింది. ఇది మాకు చాలా పెద్ద విషయం. షారూఖ్ ప్రశంసతో నా కళ్లలో నీళ్లు తిరిగాయ'ని కరణ్ జోహార్ చెప్పాడు.
అయితే 'యే దిల్ హై ముష్కిల్' ట్రైలర్ చూసి షారూఖ్ పెదవి విచారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన తోసిపుచ్చాడు. తాను ట్రైలర్ చూడలేదని, పాటలు మాత్రమే విన్నానని చెప్పాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. ఐశ్వరరాయ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఫవద్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'యే దిల్ హై ముష్కిల్' సినిమా దీపావళికి విడుదల కానుంది.