![No Pelli Cover Song With Tollywood Singers From Solo Brathuke So Better - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/5/No-Pelli.jpg.webp?itok=eFmWt4Ng)
"వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.." అంటూ నాగార్జున ఓ సినిమాలో ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు హీరో సాయిధరమ్ తేజ్‌కు అదే నిజమనిపించింది. బ్యాచిలర్ లైఫే బెస్ట్ అని తెలుపుతూ.. "నో పెళ్లి.. దీని తల్లి" అంటూ వివాహంపైనే విరక్తి చూపిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం నుంచి 'నో పెళ్లి' వీడియో సాంగ్ ఇదివరకే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అది 5 మిలియన్ల వ్యూస్‌ను సైతం అలవోకగా దాటేసింది. ఇప్పుడు తాజాగా 'నో పెళ్లి' కవర్ వర్షన్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో మనీషా, శ్రావణ భార్గవి, రోల్ రైడా, నోయల్, గీతా మాధురి, టిప్పు, శ్రీ కృష్ణ, రమ్య సహా పలువురు సింగర్లు ఉన్నారు. (‘నో పెళ్లి’ అంటున్న సాయి, వరుణ్ తేజ్)
టాలీవుడ్ గాయనీగాయకులు అందరూ ఒకేదగ్గర కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫేవరెట్ సింగర్స్‌ను చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ సాంగ్‌కు బ్యాచిలర్స్ జై కొడుతుంటే పెళ్లైనవారు మాత్రం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. "ఎవరూ పెళ్లి చేసుకుని బలైపోకండ్రా బాబూ.." అని కొందరు మగ మహారాజులు సెలవిస్తుంటే మరికొందరు మాత్రం "ఎప్పటికైనా ఈ బంధంలో చిక్కుకోక తప్పదు, అప్పటివరకే ఈ ఆటలు, పాటలు.." అంటూ దెప్పి పొడుస్తున్నారు. కాగా రఘురామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అర్మన్ మాలిక్ ఆలపించగా యశ్వంత్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. (ఏంటి బావా నీకు పెళ్లంటగా..)
Comments
Please login to add a commentAdd a comment