ప్రియాంక ఒప్పుకుంటుందా!
తమ కథను సినిమాగా చూసుకునే అదృష్టం ఇప్పటివరకూ మన దేశంలో చాలా తక్కువమందికే దక్కింది. అయితే... ఆంతరంగికమైన విషయాలకు కూడా తెరరూపాన్ని ఇస్తే మాత్రం అది చాలా ఇబ్బందికరం. త్వరలో ప్రియాంకా చోప్రా ఆ ఇబ్బందిని ఎదుర్కోబోతున్నారు. ఆమె మోడల్‌గా ఉన్న రోజుల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల ఆధారంగా ఓ చిత్రం తెరపైకి రానుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదు.. ప్రియాంక మాజీ ప్రియుడు అసీమ్ మర్చంట్. నిర్మాతగా తన తొలి సినిమా ఇది.
మోడలింగ్ చేసే రోజుల్లో అసీమ్‌ని ప్రియాంక ప్రేమించారు. అయితే... మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న రెండేళ్ల తర్వాత మర్చంట్ నుంచి విడిపోయారామె. అప్పట్నుంచి వీరిద్దరూ పెద్దగా టచ్‌లో లేరట. ప్రస్తుతం అసీమ్ నటుడుగా కొనసాగుతున్నారు. సల్మాన్ ‘వాంటెడ్’లో కీలక భూమికను కూడా పోషించారు. ఇప్పుడు తానే... తన మాజీ ప్రియురాలైన ప్రియాంక మోడలింగ్ రోజుల్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
అంతేకాదు... 2008లో ప్రియాంకకు తన మేనేజర్ ప్రకాశ్ జాజుతో ఆర్థిక పరమైన గొడవలొచ్చాయి. ఆ ఇష్యూని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట అసీమ్. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే... ప్రియాంక నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందనా రాలేదు. తన విజయాలకు తెరరూపాన్నిస్తే... అది నిజంగా ప్రియాంక ఆనందించదగ్గ విషయమే. కొంపదీసి తన ఆంతరంగికమైన విషయాలను కూడా అందులో చూపిస్తే అది కచ్చితంగా ఆమెకు ఇబ్బందే. మరి తన కథకు తెరరూపాన్ని ఇవ్వడానికి ప్రియాంక అంగీకరిస్తారో లేక, అభ్యంతరం వెలిబుచ్చుతారో చూడాలి.