పిల్లల దాకా వెళ్లని సినిమాలు తీసి ప్రయోజనం ఏంటి?
భద్రం కొడుకో, తోడు, పాత నగరంలో పసివాడు, గులాబీలు, అమూల్య... దర్శక–నిర్మాత అక్కినేని కుటుంబరావు తీసిన బాలల చిత్రాలివి. పిల్లల కోసం సినిమాలు తీశాననే అత్మసంతృప్తి మాత్రమే మిగిలింది. అందుకే ఇప్పుడాయన ‘బాలల చిత్రా’ల జోలికి వెళ్లడం లేదంటున్నారు. 2012, 2013 ‘నంది అవార్డు’ల జాబితాలో ‘ఉత్తమ బాలల చిత్రం’ విభాగంలో ఒక్క చిత్రం కూడా ఎంపిక కాలేదు. బాలల చిత్రాల నిర్మాణ సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? అవి పెరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఈ సందర్భంగా కుటుంబరావుతో ‘సాక్షి’ జరిపిన ‘స్పెషల్ ఇంటర్వ్యూ’...
ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఎలా అనిపిస్తోంది?
ఇది చాలా బాధపడాల్సిన విషయం. పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు తీయడం, వాళ్లకు చూపించడం చాలా ముఖ్యమైన విషయం. అందులో మనం వెనకపడ్డాం. దానికి కారణం థియేటర్లు దొరక్కపోవడం, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడం. అందువల్ల నాలాంటివాళ్లు పిల్లల సినిమాలు తీయలేకపోతున్నారు.
మీరు తీసిన ఐదు సినిమాల్లో ఏ సినిమాకైనా సబ్సిడీ వచ్చిందా?
నా ‘పాత నగరంలో పసివాడు’ సినిమా ‘కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి సెలక్ట్ అయింది. అక్కడ ప్రదర్శిస్తే మంచి స్పందన లభించింది. ఇక్కడ ‘స్వర్ణ నంది’ గెలుచుకుంది. ఇక.. సబ్సిడీ రాకపోవడానికి కారణాలు కొన్ని నియమాలు. పదకొండు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాకు సబ్సిడీ వస్తుందంటారు. అన్ని థియేటర్లు దొరకాలిగా. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుని, బాలల సినిమాలకు థియేటర్లు దొరికేలా చేయాలి.
పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు తీయడంలో పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి చెబుతారా?
ఇప్పుడు హింస నేర్పించే సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ సినిమాలు చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రులు కూడా వాటినే చూపిస్తున్నారు. భావితరం అని లెక్చరర్లు ఇస్తుంటాం. భావితరాలకు చూపించాల్సిన సినిమాలు ఇవేనా? ఇటు తల్లిదండ్రులు, అటు ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉన్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘మంచి’ నేర్పించే సినిమాలు చూపించడంవల్ల పిల్లలు మంచి మార్గం వైపు వెళతారు.
ఇప్పుడు చిల్డ్రన్ మూవీ తీయమని మిమ్మల్ని అడగడంలేదా?
కొంతమంది నిర్మాతలు వస్తున్నారు. ‘థియేటర్లు దొరకవు. సబ్సిడీ రాదు’ అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాను. దాంతో వెనక్కి తగ్గుతారు. నాకు తీయాలనే ఉంటుంది. కానీ, వచ్చే నిర్మాతల గురించి ఆలోచించాలి కదా.
పెద్ద నిర్మాతలెవరినైనా పిల్లల సినిమాలు తీయమని అడిగారా?
పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలను అడిగాను. ‘ఓ పదీ పదిహేను లక్షలు చాలు. మీకది పెద్ద విషయం కాదు. మంచి సినిమా తీద్దాం’ అని అడిగాను కానీ, ఎవరూ ఆసక్తి కనబర్చలేదు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరు చెప్పదలచుకున్నదేంటి?
ప్రతి మండలానికి కనీసం ఒక థియేటర్ అయినా నిర్మించాలి. ప్రతి శని, ఆదివారాల్లో అయినా బాలల సినిమా ప్రదర్శించుకునే వీలు కల్పించాలి. అదీ కాకపోతే ఒక స్పెషల్ షో వేసుకునే అవకాశం అయినా ఇవ్వాలి. పిల్లల దాకా వెళ్లని సినిమాలు తీసి ప్రయోజనం ఏంటి?