తమిళసినిమా: రాజకీయాల మాట ఏమోగానీ నటుడు రజనీకాంత్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఇంతకు ముందు నటించిన కబాలి చిత్రం మంచి విజయాన్నే సాధించినా, ఆ తరువాత వచ్చిన కాలా ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది నిజం. అలాంటిది తాజాగా రజనీకాంత్ నటించిన పేట సూపర్‌హిట్ టాక్‌నే తెచ్చుకుంది. ముఖ్యంగా తలైవా అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తోంది. ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సూపర్‌స్టార్‌ను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించడంతో 100 శాతం సక్సెస్ అయ్యాడు.
పేట చిత్రంలో రజనీకాంత్ వయసును 20 తగ్గించేశాడు. ఈ చిత్రం రజనీకాంత్‌లోనూ నూతనోత్సాహాన్ని నింపించదనే చెప్పాలి. దీంతో ఆయన రెట్టింపు ఎనర్జీతో వరుసగా చిత్రాలు చేయడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సంచలన చిత్రాన్ని 2.ఓ, ఇండియన్–2 చిత్రాల సంస్థ లైకానే నిర్మించబోతోందన్నది తాజా సమాచారం. కాగా ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, దీనికి నర్కాలి (కుర్చీ) అనే టైటిల్ పరిశీలనలో ఉందని జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు ఫుల్‌స్టాప్ పెట్టారు.
రజనీకాంత్‌తో తెరకెక్కించనున్న చిత్రం టైటిల్ నక్కాలి కాదని ఆయన ఇటీవల ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా సమాచారం ఏమిటంటే పేట చిత్రంలో కత్తి చేత పట్టిన రజనీకాంత్ తాజాగా లాఠీ చేత పట్టనున్నారట. అవును మురుగదాస్ ఆయన్ని పోలీస్ అధికారిగా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది. రజనీకాంత్ లాఠీ చేత పట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో మూండ్రు ముగం, పాండియన్, కొడి పరక్కుదు వంటి చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించారు. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.
ఇకపోతే ఈ చిత్రం తరువాత కూడా రజనీకాంత్ నటుడిగా కొనసాగనున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఆయన బాషా, మన్నన్, అన్నామలై వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సురేశ్‌కృష్టకు, ముత్తు, పడయప్ప వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలను అందించిన కేఎస్.రవికుమార్‌కు మంచి కథలను సిద్ధం చేయమని చెప్పినట్లు టాక్. అదేవిధంగా తనకు, యూత్‌కు నచ్చేలా పేట చిత్రంలో చూపించిన యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇవన్నీ కార్యరూపం దాల్చితే రజనీకాంత్‌ను మరో ఐదేళ్ల పాటు నటుడిగానే చూడవచ్చు. ఇది ఆయన్ని రాజకీయనాయకుడిగా చూడాలని కలలు కంటున్న అభిమానులకు నచ్చకపోవచ్చుగానీ, సినీ అభిమానులకు మాత్రం పండగచేసుకునే వార్తే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment