నటి శ్రీదేవికి బదులిచ్చిన వర్మ
వివాదాల రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చారు. వర్మ తీయబోతున్న శ్రీదేవి చిత్రంపై వివాదం చెలరేగడంతో ఆయన వాటిపై తనదైన శైలిలో స్పందించారు. ఈ చిత్ర టైటిల్ పై నటి శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లాయర్ నోటీసులు పంపిచడంతో వర్మ తాజాగా వివరణ ఇచ్చారు. అసలు నిజజీవితంలో శ్రీదేవికి, తాను తీస్తున్న శ్రీదేవి సినిమాకి ఎటువంటి సంబంధలేదన్నారు. ప్రస్తుతం తాను తీస్తున్న సినిమాలో ఒక టీనేజర్ కుర్రాడుకి 25 ఏళ్ల మహిళపై ఏవిధమైన వ్యామోహం ఉంటుందనేది చిత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కథకు- నటి శ్రీదేవికి ఎటువంటి సంబంధం లేదన్నారు. తాను తీస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్నది నటి కానప్పుడు.. ఆ కుర్రాడు దర్శకుడు కానప్పుడు ? వివాదం ఎందుకని అని ప్రశ్నించారు. చిత్రంలోని లీడ్ రోల్ పోషిస్తున్న మహిళకు ఆ టీనేజ్ కుర్రాడికి వయసు పరంగా చాలా గ్యాప్ ఉందని.. నటి శ్రీదేవికి తనకు వయసు వ్యత్యాసం లేనప్పుడు అనవసరం రాద్దాంతం ఎందుకన్నారు.
తాను గత ఐదు సంవత్సరాల నుంచి చాలాసార్లు మీడియా ముందు, బయట నటి శ్రీదేవి గురించి చెబుతూనే ఉన్న సంగతి ఈ సందర్భంగా వర్మ గుర్తు చేశారు. అప్పుడు శ్రీదేవి అంశాన్ని కామెడీగా, హెల్తీ స్పిరిట్ గా తీసుకున్నా.. ఇప్పుడు మాత్రం నానా హడావుడి చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ నుంచి ఈ టైటిల్ కు సంబంధించి హక్కులు పొందినట్లు వర్మ తెలిపారు. 'సావిత్రి సినిమా టైటిల్ ను వివాదం చెలరేగడం వల్ల మార్చలేదని, ఆ టైటిల్ ను వేరు వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నందునే మార్చానని వర్మ తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి మూడుసార్లు ' శ్రీదేవి' పేరు మీద మూడు చిత్రాలు వచ్చాయని వర్మ అన్నారు. ఇదిలా ఉండగా ఆమె ఎంత పెద్ద నటి అయినా పేరుపై ఎటువంటి హక్కులు ఉండవని వర్మ తరుపు న్యాయవాది స్పష్టం చేశారు. శ్రీదేవి నోటీసులపై తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చామన్నారు.
ఓ టీనేజ్ కుర్రాడు, ఆంటీ నాభిని చూస్తున్నట్లున్న ప్రచార చిత్రంతో ‘సావిత్రి’ అనే టైటిట్‌తో సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించగానే మహిళా సంఘాలు నుంచి పెను విమర్శలు ఎదురయ్యాయి. సావిత్రి పేరు పెట్టి, ఇలా తీస్తావా? అని ఘాటుగా స్పందించడంతో టైటిల్‌ని ‘శ్రీదేవి’ అని మార్చారు వర్మ. అయినప్పటికీ ప్రచార చిత్రాల విషయంలో ఇంకా వివాదం జరుగుతూనే ఉంది.
తాజాగా తన పేరుతో టైటిల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి శ్రీదేవి రంగంలోకొచ్చారు. తన పేరుతో సినిమా తీయడం ఏంటి అంటూ వర్మకు లాయర్ నోటీసు పంపించారామె. దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రీదేవి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని.. అందులోనూ అభ్యంతరకరంగా ఉంటుందేమోననే భావనను ప్రచార చిత్రాలు కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం తగదని శ్రీదేవి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.