రాంగోపాల్ వర్మకు సినీనటి శ్రీదేవి నోటీసులు!
రాంగోపాల్ వర్మకు సినీనటి శ్రీదేవి నోటీసులు!
Published Fri, Oct 10 2014 7:16 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
వివాదాలకు చిరునామా అనదగ్గ విధంగా రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. త్వరలో తాను రూపొందించనున్న చిత్రం విషయమై ఇప్పటికే వర్మ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ టీనేజ్ కుర్రాడు, ఆంటీ నాభిని చూస్తున్నట్లున్న ప్రచార చిత్రంతో ‘సావిత్రి’ అనే టైటిట్‌తో సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించగానే మహిళా సంఘాలు నుంచి పెను విమర్శలు ఎదురయ్యాయి. సావిత్రి పేరు పెట్టి, ఇలా తీస్తావా? అని ఘాటుగా స్పందించడంతో టైటిల్‌ని ‘శ్రీదేవి’ అని మార్చారు వర్మ. అయినప్పటికీ ప్రచార చిత్రాల విషయంలో ఇంకా వివాదం జరుగుతూనే ఉంది.
తాజాగా తన పేరుతో టైటిల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి శ్రీదేవి రంగంలోకొచ్చారు. తన పేరుతో సినిమా తీయడం ఏంటి అంటూ వర్మకు లాయర్ నోటీసు పంపించారామె. దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రీదేవి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని.. అందులోనూ అభ్యంతరకరంగా ఉంటుందేమోననే భావనను ప్రచార చిత్రాలు కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం తగదని శ్రీదేవి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
‘శ్రీదేవి’ అనే టైటిల్ పెట్టిన విషయం తెలుసుకుని, ఆమె భర్త బోనీకపూర్ వివరణ కోరాలనుకున్నప్పుడు, ఫోన్‌లోని ‘వాట్సాప్’ ద్వారా ఓ ప్రెస్‌నోట్‌ని పంపించడం, సరైన వివరణ కాదని ఆ లాయర్ అన్నారు. పలు ఇంటర్వ్యూల్లో శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె భర్త బోనీని చూస్తే అసూయగా ఉందని వర్మ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా సదరు న్యాయవాది గుర్తు చేశారు. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా స్పందించకపోతే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తన కక్షిదారు శ్రీదేవి తరఫున ఆ న్యాయవాది తెలిపారు. ఈ చిత్రం పేరు మార్చుతున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వాలని, జాతీయ స్థాయి వార్తా పత్రికల్లో క్షమాపణలు చెబుతూ, ప్రకటన ఇవ్వాలని, వేరే కొత్త టైటిల్‌ని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా చట్టప్రకారం బోల్డన్ని నిబంధలను విధిస్తూ.. వర్మకు నోటీసు పంపించారు.
Advertisement