రాజకోటలో రాచమర్యాదలు
Published Thu, Dec 26 2013 12:09 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM
కొన్ని అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేం. అది కూడా ఊరు కాని ఊరిలో మంచి అనుభవాలు ఎదురైతే దగ్గరవాళ్లకి చెప్పి, ఆనందపడిపోతాం. ప్రస్తుతం తాప్సీ ఆ ఆనందంలోనే ఉన్నారు. ఆమె కథానాయికగా నటిస్తున్న హిందీ చిత్రం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ షూటింగ్ ఇటీవల పంజాబ్‌లో జరిగింది. అక్కడి పటియాలాకి సమీపంలో ఉన్న ఓ పల్లెటూరిలో పది రోజుల పాటు ఈ యూనిట్ సభ్యులు బస చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న రాజుల కాలం నాటి కోటలో ఈ చిత్రం షూటింగ్ చేశారు. కాగా, రాజ వంశానికి చెందిన వారసులు అక్కడ నివసిస్తున్నారట.
ప్రతిరోజూ వాళ్లు ఈ షూటింగ్‌ని సందర్శించడంతో పాటు రుచికరమైన వంటకాలు తయారు చేసిచ్చేవారని తాప్సీ పేర్కొన్నారు. ఆ పంజాబీ వంటకాలను ఓ పట్టు పట్టామని కూడా ఆమె తెలిపారు. అతిథి దేవో భవ అనే తరహాలో రాజ వంశ వారసులు తమకు రాచమర్యాదలు చేశారని, రాయల్ బ్యాక్‌గ్రౌండ్‌కి చెందినవారైనా కొంచెం కూడా భేషజం చూపించలేదని, ఎంతో నిరాడంబరంగా ఉన్నారని తాప్సీ అన్నారు. అక్కడ షూటింగ్ చేసిన పది రోజులూ వారి మర్యాదలు అందుకున్నామని, ఆ షెడ్యూల్‌ని ఇప్పట్లో మర్చిపోలేనని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె ‘ముని 3’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
Advertisement
Advertisement