ఇలాంటి స్క్రిప్ట్ మళ్లీ రాదేమో – శర్వానంద్
‘‘మహానుభావుడు’ సినిమాని ఎప్పుడో విడుదల చేయాలనుకున్నాం. అయితే, మధ్యలో సెలవులు రావడంతో వద్దనుకున్నాం. దసరా పండగకి ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా వస్తే బావుంటుందని నిర్మాతలు చెప్పడంతో ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పాటల ప్రదర్శన జరిగింది. మారుతి మాట్లాడుతూ– ‘‘ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ కుటుంబం అంతా కలిసి చూసేలా ‘మహానుభావుడు’ ఉంటుంది.
శర్వానంద్, మెహరీన్‌తో పాటు అందరూ మంచి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు’’ అన్నారు. ‘‘నేను బాగా ఎంజాయ్ చేసిన పాత్ర ఇది. నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదు. ఇలాంటి స్క్రిప్ట్ మళ్లీ మళ్లీ వస్తుందనుకోవడం లేదు’’ అన్నారు శర్వానంద్. ‘‘ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మారుతిగారు చక్కగా డైరెక్ట్ చేశారు’’ అన్నారు మెహరీన్. వంశీ, ప్రమోద్, ‘జెమిని’ సురేశ్, మధుమణి, బాలు, ఎస్.కె.ఎన్. తదితరులు పాల్గొన్నారు.