బెంగళూరులో తలదించుకునే ఘటన
బెంగళూరు: బెంగళూరులో సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన చోటుచేసుకుంది. టాంజానియాకు చెందిన యువతిపై దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆ యువతిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీధుల్లో పరుగెత్తించడంతోపాటు ఆమె కారును కూడా తగులబెట్టారు. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో యాక్సిడెంట్ చేసినవారికోసం వెతుకుతున్నారు.
అదే సమయంలో టాంజానియా మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని బయటకులాగి చేయిచేసుకోవడంతోపాటు ఆమెను వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. అయితే, ఆ యాక్సిడెంట్ చేసింది మాత్రం సుడాన్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేసే చర్యలకు దిగారు.