- సరిహద్దు భద్రత మా వ్యక్తిగతం
- చైనా ఆరోపణలను తిప్పికొట్టిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ : అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణి మోహరింపుపై చైనా చేసిన వ్యాఖ్యలను భారత ఆర్మీ తిప్పికొట్టింది. భారత సరిహద్దుల్లో ఏం చేయాలనే విషయాన్ని బీజింగ్ నుంచి నిర్ణయించుకోవాలనే ఆలోచన మానుకోవాలని ఘాటుగా హెచ్చరించింది. ‘సరిహద్దు భద్రతపై ఆందోళన మా వ్యక్తిగత విషయం. అందుకోసం ఇక్కడ ఏమేం చేయాలనేది మేం నిర్ణయించుకుంటాం. చైనా తనపని తాను చూసుకుంటే బాగుంటుంది’ అని సూచించింది. ఈశాన్య రాష్ట్రల్లో సరిహద్దులను భారత్ బలోపేతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయటాన్ని ఆర్మీ దుయ్యబట్టింది.
అసలేం జరుగుతోంది: హిమాలయాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతను పటిష్టం చేసుకునే ప్రయత్నంలో భాగంగా.. అక్కడున్న రెజిమెంట్లలో ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. వంద మిసైళ్లు, ఐదు లాంచర్ ట్రక్కులతోపాటు అధునాతన బ్రహ్మోస్ క్షిపణినీ పంపించింది. ధ్వనివేగానికి 2.8 రెట్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి.. పర్వత శ్రేణుల్లో దాగున్న లక్ష్యాలనూ.. పక్కాగా ఛేదిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భూభాగం తమదేనని వాదిస్తున్న చైనా.. లైన్ ఆఫ్ కంట్రోల్ (వాస్తవాధీన రేఖ) వెంబడి పలుమార్లు చొరబాట్లకు పాల్పడింది. దీంతో ఇరుదేశాల మధ్య కాస్త ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. అయితే.. దీన్ని జీర్ణించుకోలేని చైనా ‘భారత్ కయ్యానికి కాలుదువ్వుతోంద’ని విమర్శలు చేస్తోంది.
మీ పని చూసుకోండి
Published Wed, Aug 24 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
Advertisement