సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలు, పార్టీ నాయకుల ఒత్తిళ్లపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కాంగ్రెస్ అధిష్టానం గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. ఆ ప్రాంత నేతల అభిప్రాయాలను, ఫిర్యాదులను వినేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఒకసారి.. కమిటీని ఏర్పాటు చేశామని, పని మొదలు పెట్టిందని మరొకసారి.. రెండు మూడు రోజుల్లో కమిటీని ప్రకటిస్తామని ఇంకొకసారి.. తమను కలిసిన నాయకులకు రకరకాలుగా చెప్తుండటమే ఇందుకు నిదర్శనం. అదీగాక.. ఒక్కరే ఈ సమస్యలను పరిశీలిస్తారని తొలుత చెప్పిన కాంగ్రెస్ నాయకత్వం.. ఆ తర్వాత ఇద్దరు సభ్యులతో కమిటీ అని, అనంతరం ముగ్గురు సభ్యులని చెప్పగా.. ఇప్పుడు మొత్తం ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఉంటుందని పేర్కొనటం విశేషం.
సీమాంధ్ర నేతల ఆందోళనలు, అభిప్రాయాలను వినే పనిని తొలుత సహజంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించారు. ఆ తర్వాత.. దిగ్విజయ్‌సింగ్, గులాంనబీఆజాద్‌లతో ఇద్దరు సభ్యుల కమిటీ ఉంటుందని హైకమాండ్ చెప్పింది. ఈ విషయం తొలుత కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆ తర్వాత స్వయంగా దిగ్విజయ్ కూడా ప్రకటించారు. సోమవారం రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర నేతలతో ఆంటోనీ మాట్లాడటం మొదలుపెట్టారని కూడా ఆయన ప్రకటించారు. కానీ.. అసలు ఇలాంటి కమిటీ ఏర్పాటు గురించి తనకు ఏమీ తెలియదని ఆంటోని మంగళవారం స్పష్టం చేయటం విశేషం. ఈ కమిటీ విషయంలో తనకు పార్టీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కూడా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో తనను కలిసిన విలేకరులతో పేర్కొన్నారు.
మరోవైపు.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర సహాయమంత్రి జె.డి.శీలం ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను వినేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఉంటుందని చెప్పారు. ఆ కమిటీలో ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్‌లు ఉంటారని పేర్కొన్నారు. కానీ సాయంత్రానికల్లా అది ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అని.. అందులో ఆంటోనీ, మొయిలీ, దిగ్విజయ్‌లతో పాటు ఆజాద్, సుశీల్‌కుమార్‌షిండేలు కూడా ఉంటారన్న మాట బయటకు వచ్చింది. ఈ విషయం రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఐదుగురు నేతలతో కమిటీ ఉంటుందని సోనియాగాంధీ స్వయంగా తమకు చెప్పారని ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మీడియాతో పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేయబోయే కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు.. ఏ ఏ అంశాలను పరిశీలిస్తుంది అనే విషయాలను దిగ్విజయ్ త్వరలో ప్రకటిస్తారని.. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు సోనియాను కలిసిన తర్వాత మీడియాతో చెప్పటం మరో విశేషం.
విభజనపై వాదప్రతివాదనలు వినేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీ ఐదుగురు సభ్యుల వద్ద ఆగుతుందా ఇంకా పెరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలు తెలంగాణ ఏర్పాటు త్వరగా పూర్తికావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ ప్రాంత నేతలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి గందరగోళం లేదు. ‘మాకు వివరించిన ప్రకారం నోట్ ముసాయిదాను రూపొందిస్తున్నాం’ అని ఆ శాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
‘కమిటీ’ కహానీలు... కాంగ్రెస్ నుంచి పూటకో మాట
Published Wed, Aug 7 2013 5:33 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement