చీఫ్ డాక్టర్ ఉద్యోగానికి ఎసరుతెచ్చిన కుక్క! | Days After Refusing 'Dog Dialysis', Chief of Kolkata's Premier Hospital Transferred | Sakshi
Sakshi News home page

చీఫ్ డాక్టర్ ఉద్యోగానికి ఎసరుతెచ్చిన కుక్క!

Published Thu, Jun 25 2015 11:54 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

చీఫ్ డాక్టర్ ఉద్యోగానికి ఎసరుతెచ్చిన కుక్క! - Sakshi

చీఫ్ డాక్టర్ ఉద్యోగానికి ఎసరుతెచ్చిన కుక్క!

కోల్ కతా: మన ఇంట్లో పెంచుకునే మూగ జీవాలకు ఏ జబ్బు చేసినా పశు వైద్యశాలల్లోనే వాటికి చికిత్స అందిస్తాం. అయితే పశ్చిమబెంగాల్ ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.  తాను అతి గారాభంగా పెంచుకునే చిట్టి పొట్టి కుక్కకు గవర్నమెంట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయాలని  ఓ ఎమ్మెల్యే ఆదేశాలను ప్రశ్నించిన చీఫ్ డాక్టర్ పై వేటుపడిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

 


వివరాల్లోకి వెళితే.. రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ నిర్మల్ మజీ ఇంటి కుక్కకు కాస్త జబ్బు చేసిందట. అయితే తన అందాల కుక్కకు డయాలసిస్ చేయాలని ఎమ్మెల్యే భావించారు. కాగా, కోల్ కతాలో ఎక్కడ కూడా పశు సంబంధిత డయాలసిస్ కేంద్రం లేదు. దీంతో ఆ ఎమ్మెల్యే తన కుక్కకు డయాలసిస్ చేయాలంటూ ఎస్ఎస్ కేమ్ గవర్నమెంట్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. దీనికి అక్కడ డైరెక్టర్ గా, చీఫ్ డాక్టర్ గా ఉన్న డాక్టర్ ప్రదీప్ మిత్రా అంగీకరించలేదు.

 

అయితే మరో డాక్టర్ పాండే ఆదేశాలతో జూనియర్ డాక్టర్లు జూన్ 10 వ తేదీన ఎమ్మెల్యేగారి కుక్కకు డయాలసిస్ చేయడానికి సన్నద్ధమయ్యారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న ప్రదీప్ ఆ డయాలసిస్ చేయడాన్ని ఆపాలని ఆర్డర్ జారీ చేశారు. దీంతో డాక్టర్ ప్రదీప్ కు పాండే కొద్దిగా క్లాస్ తీసుకున్నారు. వీఐపీలకు చెందిన కుక్కలకు డయాలసిస్ చేయొచ్చు అంటూ సదరు నేతలపై భక్తిని చాటుకున్నాడు డాక్టర్ పాండే.

 

ఇది జరిగి దాదాపు చాలా రోజులు కావొస్తున్నా.. జూన్ 23 వ తేదీన ప్రదీప్ బదిలీ అవుతున్నట్లు ఆదేశాలు అందుకున్నాడు.  దీంతో విసుగు చెందిన డాక్టర్ ప్రదీప్ ముందస్తు రిటైర్మెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. గత మూడు దశాబ్దాలుగా పైగా ఇక్కడే విధులు నిర్వరిస్తున్న తనపై ఆకస్మిక వేటు నిజంగా అగౌరపరిచేదిగా ఉందన్నాడు.  అయితే ఇలా ఎందుకు జరిగిందో తనకు కచ్చితంగా తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటనపై  ఎమ్మెల్యే నిర్మల్ మజీ మాత్రం భిన్నస్వరాలు వినిపించారు.  కుక్కకు డయాలసిస్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించిన సదరు ఎమ్మెల్యే .. ఆ తర్వాత తనకు అసలు కుక్క లేదంటూ మాట మార్చడం అనేక విమర్శలకు దారి తీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement