టీచర్ కొలువుకు గాంధీ, బచ్చన్ దరఖాస్తు!
లక్నో: బడి పంతులు ఉద్యోగానికి జాతిపిత మహాత్మగాంధీ, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దరఖాస్తు చేసుకున్నారట. ఈ చోద్యం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అంతేకాదు, గాంధీ 94శాతం మార్కులతో మెరిట్ లిస్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నాడట. ఇది చూసి అధికారులు నివ్వెరపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే బేసిక్ టీచింగ్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అసిస్టెంట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే 16,448 పోస్టులను పూర్తి చేయగా ప్రస్తుతం లక్నోలో ఉన్న 33 పోస్టులకు 800 దరఖాస్తులు వచ్చాయి.
వీటన్నింటిని క్రోడీకరించి మెరిట్ జాబితా తయారు చేసే అధికారులకు మహాత్మాగాంధీ, అమితాబ్ బచ్చన్ ఇలా మొత్తం 15 దరఖాస్తులు పూర్తి భిన్నంగా కనిపించాయి. తొలుత జాబితా ప్రకటించాలా వద్దా అని ఆపేసిన అధికారులు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, మళ్లీ నిర్ణయం మార్చుకొని తదుపరి రోజు మెరిట్ జాబితా ప్రకటించారు. ఇందులో మొదటి పేరు గాంధీది ఉండగా.. రెండో పేరు అర్షద్ అనే పేరు ఉంది. అయితే, ఇంటిపేరు మాత్రం గందరగోళంగా ఉంది. జాబితా ప్రకటించిన తర్వాత ఏ ఒక్కరూ రాకపోవడంతో ఎవరో ఆకతాయిలు కావాలని ఇలా చేసినట్లుందని ఆ దరఖాస్తులను పక్కకు పడేశారు. ఇలాంటి చర్యలు మంచిది కాదని ప్రకటన విడుదల చేశారు.