29.8 సెం.మీ వర్షపాతం నమోదు
- ఇళ్లలోకి చేరిన నీరు...రోడ్లపై నిలిచిన వేలాది వాహనాలు
- 24 గంటల్లో మరింత భారీ వర్షాలు:ఐఎండీ
- సీఎంతో మాట్లాడిన మోదీ...కేంద్రం నుంచి సాయమందిస్తామని హామీ
ముంబై: దేశంలోనే అతిపెద్ద నగరం ముంబైని మంగళవారం కుండపోత వర్షాలు ముంచెత్తా యి. మంగళవారం ఏకంగా 29.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాంటాక్రూజ్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. 1997 తర్వాత నుంచి చూస్తే ఆగస్టు నెలలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. వరుణుడి దెబ్బతో రోడ్డు, రైలు రవాణా, విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. అనేక ప్రాంతాల్లో నీళ్లు నడుము లోతు వరకు ప్రవహించగా, ఇళ్లు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. దాదర్, కుర్లా, అంధేరి, ఘాట్కోపర్, దిగువ పరేల్, ఖర్ వెస్ట్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో వాహనాలు నీటిలో చిక్కుకుని రోడ్లపై నిలిచిపోయాయి. అటు అలల ఉధృతి కూడా పెరగడంతో వర్షపు నీరు సముద్రంలో కలవడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ముంబై వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి 11.30 మధ్య కేవలం మూడు గంటల్లోనే సగటున 6.5 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెప్పింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.
కేంద్రం నుంచి సాయం: మోదీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న విస్‌తో ప్రధాని మోదీ మాట్లాడి నగరంలో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ముంబై, సమీప ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని మోదీ ట్వీటర్‌లో సూచించారు. మరోవైపు ఫడ్నవిస్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగాన్ని తనిఖీ చేశారు. పోలీసు కమిషనర్, నగర పాలక సంస్థ అధికారులతో మాట్లాడి పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. సచివాల యంలోని ఉద్యోగులను ఫడ్నవిస్ ముందు గానే ఇళ్లకు పంపించేశారు. పాఠశాలలు, కార్యాలయాలు కూడా విద్యార్థులు, ఉద్యోగులను పంపించేయాలని ఆయన ఆదేశించారు.
అటు నౌకాదళం కూడా సహాయక చర్యల కోసం సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచింది. అవసరమైన వెంటనే రంగంలోకి దిగేం దుకు వీలుగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో వరద సహాయక బృందాలు, హెలికాప్టర్లు, ఈతగాళ్లు, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని నేవీ అధికార ప్రతినిధి ట్వీటర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు ముంబై, దక్షిణ గుజరాత్, కొంకణ్, గోవా, పశ్చిమ విదర్భ తదితర ప్రాంతాల్లో రానున్న ఒక ట్రెండు రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయనీ, పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని పుణేలోని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేశారు. 2005 జూలైలోనూ ముంబైని వరదలు ముం చెత్తగా 500 మందికి పైగా చనిపోయారు.
నిలిచిపోయిన సబర్బన్ రైళ్లు
రైలు పట్టాలపైకి నీరు చేరడంతో ముంబై జీవన రేఖగా పేర్కొనే సబర్బన్ రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. మూడు సబర్బన్ మార్గాల్లోనూ కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని గంటల తరబడి పట్టాలపైనే నిలిచిపోయాయి. అనేక మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఉదయం నుంచి విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత రన్‌వేపై దిగేందుకు విమానాలను అనుమతించలేదు. ఆరు విమానాలను పూర్తిగా రద్దు చేయగా, పదింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఇక ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ నత్తలతో పోటీపడుతూ ముందుకు సాగింది.
పట్టాలు తప్పిన ‘దురంతో’
కొండ చరియలు విరిగి రైలు పట్టాలపై పడటంతో నాగ్‌పూర్–ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని వసింద్, అసన్‌గావ్ స్టేషన్ల మధ్య రైలు ఇంజిన్, 9 బోగీలు పట్టాలు తప్పాయని, ఎవరూ చనిపోలేదని రైల్వే పేర్కొంది. కొండ చరియలు పడి ఉండటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేశాడనీ, అందుకే ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ముంబైలో భారీ వర్షానికి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు