‘భార్యను కాలేకపోయా.. అమ్మగా మాత్రం చనిపోతా’
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత ఎంతటి డేరింగ్ డైనమిక్ నాయకురాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే దానికోసం ఎలాంటి పరిస్థితుల్లో నిలబడతారు. అవసరం అయితే ఓడిపోతున్నా తిరిగి ఆ ఓటమిని గెలుపుగా మార్చుకునేవరకు విశ్రమించరు. ఆమె గురించి పలువురికి పలు అనుమానాలు ఉండొచ్చేమోగానీ, ఆమెకు మాత్రం పూర్తి స్పష్టత ఉంటుంది.
జయ ఎంత డేరింగో, ఆమె ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఎలా ఇస్తారో ఒక సంఘటనను పరిశీలిస్తే.. 1999లో ఓ ఆంగ్ల చానెల్ జయలలితను వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. మీ జీవితంలో ప్రతి మలుపులో భిన్న రూమర్లు వస్తున్నాయిగా అని ప్రశ్నించగా ఆమె చాలా ధైర్యంగా సమాధానం ఇచ్చారు.
’నేను వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యాను. నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఎంజీఆర్‌ను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నేను అదే చేశాను. అయితే, చట్టబద్ధమైన సంబంధానికి(పెళ్లికి) నేను అంగీకరించలేదు. నన్ను నేను గుర్తించాలన్న కసి నాలో మొదలైంది. మా అమ్మ ఇప్పుడు బతికే ఉంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నా వ్యక్తిగత జీవితం తప్పకుండా మరోలా ఉండేదని నేనెప్పుడు బాధపడుతుంటాను. నా గుర్తింపు అంటే ఎంజీఆర్ అని నిరూపించాలని అనుకున్నాను. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి పుట్టి కూతురుగా పెరిగి భార్యగా కాపురం చేసి తల్లిగా చనిపోవాలి. కానీ నేను భార్య స్థానాన్ని పొందలేకపోయాను. కానీ, చివరికి అమ్మగా గుర్తింపును పొంది మాత్రం చనిపోతాను’ అంటూ ఓ సందర్భంలో ఆమె చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు.