నన్ను గెలిపిస్తే.. తెలుగోడి శక్తిని తెలియజేస్తా!
తమిళనాడు: తమిళనాడులో జయలలిత పోటీచేస్తున్న ఆర్కె నగర్, హోసూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆయన జయలలితకు ప్రత్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఆర్కె నగర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉండగా, హోసూరులో ఒక లక్ష ఎనభై వేలమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందంటూ ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో అభ్యర్థించారు.
తమిళనాడు రాజకీయ పార్టీల ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా తెలుగు ప్రజలను కోరారు. తమిళనాడులో ద్విభాషా విద్యావిధానం అమలులో ఉందని, దీనికి బదులుగా త్రిభాష విద్యా విధానం అమలు చేయాలని, ఉగాది పండుగను ప్రభుత్వ పండుగగా ఘనంగా నిర్వహించుకోవాలని కేతిరెడ్డి చెప్పారు.
తమిళనాడులో అన్నీ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 35 మంది శాసన సభ్యులు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అయితే తెలుగు వారి సమస్యలపై వారు ఏనాడు స్పందించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకుంటే తెలుగు వారి సమస్యలపై పోరాటం చేస్తానని.. తెలుగు వాడి శక్తిని పాలకులకు తెలియజేస్తానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు.