భార్యకు నివాళిగా అలా చేశాడు.. | Man Refused to Spend Money on Rituals After His Wife’s Death, Built a Digital School Instead | Sakshi
Sakshi News home page

భార్యకు నివాళిగా అలా చేశాడు..

Published Thu, Feb 25 2016 10:12 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

భార్యకు నివాళిగా అలా చేశాడు.. - Sakshi

భార్యకు నివాళిగా అలా చేశాడు..

ముంబై: భార్య కోసం తాజ్మహల్ కట్టించిన మొగల్ చక్రవర్తిని సైతం తోసి రాజన్నాడు మహారాష్ట్రలోని ఓ వ్యక్తి. భార్య ఆకాంక్ష కోసం ఆమె అంత్యక్రియల అనంతరం చేయాల్సిన క్రతువులను పక్కనబెట్టి ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచాడు. ప్రాణప్రదమైన భార్యకు అరుదైన నివాళి అర్పించాడు.

మహారాష్ట్ర లోని అకోలాకు చెందిన అవినాష్ నాకత్(35) రూపాలి దంపతులది ఆదర్శవంతమైన జీవితం. సమృద్ధి, ఆనంది అనే ఇద్దరు కూతుళ్లతో సంతోషంగా జీవిస్తున్న కుటుంబం. వృత్తిరీత్యా అతనిది పెస్ట్ కంట్రోల్  బిజినెస్. దీంతో పాటుగా రైతుహక్కుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. రూపాలి కూడా ఈ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామిగా ఉండేది. ఇంతలో  క్యాన్సర్ మహమ్మారి ఆ కుటుంబానికి అశనిపాతంలా తగిలింది. ఆమెకు అక్యూట్ లుకేమియా సోకిందని, మెదడులోని కణాలు దెబ్బతిన్నాయని ఫిబ్రవరి 3న వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యంకోసం ప్రయత్నిస్తుండగానే బ్రెయిన్ హేమరేజ్తో ఫిబ్రవరి 5న ఆమె కన్నుమూసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా అయిపోయింది.

భార్య మరణం కృంగదీసినా, సామాజిక కార్యకర్తగా తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. క్రతువుల పేరుతో డబ్బును వృధాగా ఖర్చు చేయడం తనకు ఇష్టంలేదని గ్రామం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని అంత్య్రక్రియల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతే గ్రామస్తులు, బంధువులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు, బెదరించారు. చివరికి రూపాలి తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి తేవాలని ప్రయత్నించారు. అయినా అవినాష్ వెనుకడగువేయలేదు. తన గ్రామం కోసం ఏదైనా మంచి పనిచేయాలని ఆశపడ్డ తన భార్య మాటలను మననం చేసుకున్నాడు.

తన నిర్ణయానికి కట్టుబడి, తను చదువుకున్న తాండ్లిలోని జిల్లా పరిషత్ స్కూలు సంస్కరణకు నాంది పలికాడు. సుమారు లక్షన్నర రూపాయలు వెచ్చించి, గోడలకు సున్నం వేయించడం దగ్గరనుంచి పాఠశాలకు డిజిటల్ రూపం తీసుకురావడం దాకా అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. యువరాష్ట్ర స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో అతికొద్ది సమయంలోనే పూర్తిచేసాడు. ముందు వ్యతిరేకించిన గ్రామస్తులంతా తర్వాత అవినాష్ ను అభినందలతో ముంచెత్తారు.

గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య పూర్తి డిజిటల్ గా మారిన పాఠశాలను ఈ నెల 22న తన తల్లి చేతులు మీదుగా ఆవిష్కరింపచేశాడు. దీంతో ఆ స్కూల్లో విద్యనభ్యస్తున్న పిల్లల మొహాల్లో కొత్త వెలుగులు పూయించాడు. ఇక్కడ చదువుకునే వారంతా పేదరైతుల బిడ్డలే కావడం గమనార్హం. అంతేకాదు స్కూలు కోసం వాటర్ ప్యూరిఫయర్ ను దానం చేయడానికి కొంతమంది ముందుకొచ్చారు.

'నేను దేవుడిని నమ్ముతాను కానీ మూఢ సంప్రదాయాలను గుడ్డిగా నమ్మను. ఇంతవరకూ లక్షల రూపాయలు వెచ్చించి చేసిన ఇలాంటి సంప్రదాయ క్రతువుల వల్ల గ్రామానికి ఒరిగిందేమీ లేదు. నేను వేసిన ఈ తొలి అడుగుతో  గ్రామస్తుల్లో ఆలోచన మొదలైంది. నా అడుగుజాడల్లో మరింత ముందుకు రావడం సంతోషంగా ఉంది' అని అవినాష్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement