ఏపీ నుంచి నిర్మలా సీతారామన్కు రాజ్యసభ బెర్తు!
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్లకు రాజ్యసభ బెర్తులు దక్కనున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి జవదేకర్లను రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మలకు అవకాశం కల్పించవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం వీరిద్దరూ పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యులు కారు. బీజేపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరించిన నిర్మల, జవదేకర్ లోక్సఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినా ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లో వీరిద్దరికీ స్వతంత్ర హోదాతో కీలక శాఖలు అప్పగించారు.
రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణించడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ స్థానం ఖాళీ అయింది. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ.. ఈ సీటును బీజేపీకి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో నిర్మలకు అవకాశం రావచ్చని భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నిర్మల ఆంధ్రప్రదేశ్కు చెందిన పరకాల ప్రభాకర్ను పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.