టేబుల్‌ నంబర్‌ 9.. చికెన్‌ కుర్‌కురే | Rahul Gandhi Eat Chicken While Mansarovar Yatra | Sakshi
Sakshi News home page

టేబుల్‌ నంబర్‌ 9.. చికెన్‌ కుర్‌కురే

Published Wed, Sep 5 2018 9:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:57 AM

Rahul Gandhi Eat Chicken While Mansarovar Yatra - Sakshi

హిందూ ఆలయంలో రాహుల్‌ గాంధీ (ఫైల్‌)

న్యూఢిల్లీ : ‘పరమ శివునికి మహా భక్తున్ని అని చెప్పుకుంటూ.. పవిత్ర  మానససరోవర యాత్ర చేస్తున్న మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు’ అంటూ భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై విరుచుకు పడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. విషయమేంటంటే ప్రస్తుతం మానససరోవర యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ ఆగస్టు 31న నేపాల్‌ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. ఆ సమయంలో భోజనం చేయడం కోసం ‘వూటూ’ రెస్టారెంట్‌కి వెళ్లారు. ఈ విషయం గురించి సదరు రెస్టారెంట్‌ ప్రస్తావిస్తూ ‘రాహుల్‌ గాంధీ ఓ సాధారణ వ్యక్తి లాగానే రెస్టారెంట్‌కి వచ్చారంటూ’ తన వెబ్‌సైట్‌లో ఓ పోస్టు కూడా పెట్టింది.

రాహుల్‌ గాంధీ వూటూ రెస్టారెంట్‌ని సందర్శించిన విషయం తెలుసుకున్న స్థానిక మీడియా రాహుల్‌ గాంధీ భోజన విషయాలను తెలుసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఓ వెయిటర్‌ ద్వారా రాహుల్‌ ఎక్కడ కూర్చున్నారు.. ఏం ఆర్డర్‌ చేశారు వంటి విషయాల గురించి కూపీ లాగింది. సదరు వెయిటర్‌ రాహుల్‌ రెస్టారెంట్‌లోని 9వ నంబర్‌ టేబుల్‌లో కూర్చున్నారని, భోజనంలో భాగంగా చికెన్‌ కుర్‌కురే ఆర్డర్‌ చేశారని తెలిపాడు.

ఇంకేముంది మీడియా వారికి మంచి వార్త దొరికింది. ఈ విషయాలను పలు టీవీ చానల్స్‌ గంటల కొద్ది ప్రసారం చేయడంతో రాహుల్‌గాంధీ మీద బీజేపీ నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ‘ నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛ మీకు ఉంది. కానీ మీరు శివభక్తున్ని అని చెప్పుకుంటూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మానససరోవర యాత్రలో ఉండి ఇలా మాంసాహారం తినడం సమంజసమేనా..? మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారం’టూ రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

రాహుల్‌ భోజనం విషయం తీవ్రం కావడంతో సదరు రెస్టారెంట్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. రాహుల్‌ తమ రెస్టారెంట్‌లో శాఖాహార భోజనాన్నే ఆర్డర్‌ చేశారని.. తమ వెయిటర్‌ ఏ మీడియా సంస్థకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. తమ రెస్టారెంట్‌లో దొరికే శాఖాహార వంటల వివరాలను తెలుపుతూ ఓ లేఖ విడుదల చేసింది. కానీ ఈలోపే ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ ప్రారంభమైంది. రాహుల్‌ గాంధీ చేసిన పని సమంజసంగా లేదంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు.

గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ ప్రయాణం చేస్తున్న విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాతు రాహుల్‌ గాంధీ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. దాంతో పరమేశ్వరుని మహిమ వల్లే తను సురక్షితంగా బయటపడ్డానని అందుకే ఈ ఏడాది మానససరోవర యాత్ర చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్‌ గాంధీ ఈ యాత్ర తలపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement