'అమెరికాను చెంపదెబ్బ కొట్టి రావాల్సింది'
ముంబై: అమెరికాలో చేదు అనుభవం ఎదుర్కొన్న బాలీవుడు అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిందని శివసేన పేర్కొంది. దేశభక్తిని చూపించి స్వదేశానికి తిరిగి వచ్చుంటే అమెరికాను చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన అభిప్రాయపడింది. ఏడేళ్లలో షారూఖ్ ఖాన్ ను అమెరికా విమానాశ్రయాల్లో మూడుసార్లు నిర్బంధించారని తెలిపింది. లాస్ ఏంజెలెజ్ ఎయిర్ పోర్టులో షారూఖ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై శివసేన స్పందిస్తూ... అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో షారూఖ్ ను నిర్బంధించడం సాధారణ విషయంగా మారిందని, అవమానాలు ఎదురవుతున్నా అగ్రదేశానికి వెళ్లడం ఆయన మానలేదని ఆక్షేపించింది. 'ఈవిధంగా నన్ను అవమానిస్తే ఇక మీ దేశంలో అడుగు పెట్టను' అని షారూఖ్ స్వదేశానికి తిరిగి వచ్చేసివుంటే అమెరికా ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని శివసేన పేర్కొంది. ప్రతి ముస్లింను తీవ్రవాదిగా అమెరికా భావిస్తోందని విమర్శించింది. కశ్మీర్ యువత పెడదోవ పట్టకుండా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని షారూఖ్ ఖాన్ కు శివసేన సూచించింది.