బీజేపీ–ఆరెస్సెస్‌లతో బాబు మార్క్‌ గేమ్స్‌! | TDP Chief Chandrababu Mark Games With BJP And RSS | Sakshi
Sakshi News home page

బీజేపీ–ఆరెస్సెస్‌లతో బాబు మార్క్‌ గేమ్స్‌!

Published Sun, Jan 13 2019 1:41 AM | Last Updated on Sun, Jan 13 2019 8:23 PM

TDP Chief Chandrababu Mark Games With BJP And RSS - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై, బీజేపీపై ఎక్కడలేని విషం కక్కుతున్నట్లు నటిస్తున్న చంద్రబాబు.. తెరవెనక మాత్రం ఎన్డీయేతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సారథ్యంలో కూటమి ఏర్పాటుచేస్తానంటూనే.. బీజేపీతో లోపాయకారి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలతో సంబంధాలు నెరుపుతున్న విషయం ఇప్పుడు దేశరాజధానిలో హాట్‌టాపిక్‌గా మారింది. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, ప్రధాని మోదీకి మాత్రమే వ్యతిరేకినంటూ ఆ నేతలతో బాబు పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోదీని మారుస్తానంటూ ఎన్డీయేకు మద్దతిచ్చేందుకు తనకెలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆర్థిక మంత్రి జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జలనవరుల మంత్రి గడ్కరీతో చంద్రబాబు మంతనాలు జరిపిన విషయాన్ని బీజేపీ వర్గాలే ధ్రువీకరించాయి. 

ఆరెస్సెస్‌ నేతలతో సమావేశం:
రాందేవ్‌బాబాకు సంఘ్‌ పరివార్‌తో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కొందరు ఆరెస్సెస్‌ ముఖ్యనేతలతోనూ బాబు చర్చించిన విషయం కూడా బట్టబయలైంది. వచ్చే ఎన్నికల్లో మోదీ బదులు గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని.. ఆరెస్సెస్‌ నేతలతో సమావేశంలో పేర్కొన్నారని ఆరెస్సెస్‌ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఈ సమావేశాల ప్రభావంతోనే.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తర్వాత గడ్కరీ వ్యాఖ్యానించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుట్రలను పసిగట్టిన ఆరెస్సెస్‌.. నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. గడ్కరీని హెచ్చరించింది.

అసహ్యకరమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేతలకు, శ్రేణులకు స్పష్టం చేసింది. ఆయనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పొత్తుండదని నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి స్పష్టమైన సందేశాలు జారీఅయ్యాయి. ‘బాబు వ్యవహారం సాగదీస్తే.. బీజేపీలో చిచ్చురేగే ప్రమాదం ఉందని సంఘ్‌ సకాలంలో గుర్తించింది. దేశంలో ఆయనంత అవకాశవాద రాజకీయనాయకుడిని చూడలేదు’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఇదేనా సహజ మిత్రత్వం 
చంద్రబాబు ఎన్డీయేను వీడినా ఆయన తమకు సహజ మిత్రుడని పార్లమెంట్‌లో ప్రకటించిన హోంమంత్రి రాజనాథ్‌ సింగ్‌ ద్వారా చంద్రబాబు మొదట రాయబారం నడిపారు. ఎన్డీయే నుంచి బయటపడేందుకు మోదీ వైఖరే కారణమని.. బీజేపీ పట్ల తనకెలాంటి వ్యతిరేకతా లేదని చెప్పుకున్నారు. పనిలో పనిగా జైట్లీని కలిసి బీజేపీ పట్ల తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత మోదీని మారిస్తే బీజేపీకి మద్దతు ఇస్తానని భరోసా ఇచ్చారు. అయితే, ఈ విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని ఈ ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. దీంతో వీరితో లాభం లేదని గ్రహించి ఆరెస్సెస్‌ వైపు దృష్టి మళ్లించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ద్వారా కథ నడిపించాలని చూశారు.

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీకి సీట్లు తక్కువైతే.. ఆయా పార్టీల మద్దతు కూడగడుతానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మోదీపై గడ్కరీ వ్యాఖ్యలు చేయడం.. పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈలోపే.. గడ్కరీ సాయంతో చంద్రబాబు ఒకరిద్దరు ఆరెస్సెస్‌ నేతలతో సమావేశమై.. తన మనోగతం పంచుకున్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే బీజేపీకి దూరంగా ఉండాల్సి వస్తోందని, ఎన్నికల తర్వాత తాను ఎన్డీయేతో ఉంటానని చెప్పారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. ఎటొచ్చి మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని లోపాయికారిగా మా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నాడు. అంతటితో ఆగకుండా మా పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు’అని ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమయం వచ్చినప్పుడు ఆయన వ్యవహారాన్ని బయటపెడ్తామని.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. 

కాంగ్రెస్‌లోనూ చర్చ 
బీజేపీ అగ్రనేతలు కొందరితో చంద్రబాబు రహస్య మంతనాలు జరుపుతున్న విషయం కాంగ్రెస్‌ నేతలకు తెలిసింది. దీనిపై హస్తం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదన్న విషయం అర్థమైన చంద్రబాబు.. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవద్దన్న ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి విడివిడిగా పోటీ చేస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ డోలాయమానంలో పడింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబు వైఖరి ఏమిటన్నదానిపై కాంగ్రెస్‌ అయోమయంలో పడింది.

రాందేవ్‌ బాబా పరిచయాన్ని వాడుకుని..

యోగా గురు రాందేవ్‌ బాబాతో తనకున్న పరిచయాన్ని చంద్రబాబు చాలా బాగా వాడుకున్నారు. కొన్ని సీట్లు తక్కువైనా..వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ప్రీపోల్‌ సర్వేలు చెబుతున్న నేపథ్యాన్ని ఉదహరిస్తూ.. నేనున్నానంటూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఈ కారణంగానే బాబా రాందేవ్‌ ద్వారా సంఘ్‌పరివార్‌లో ఒకరిద్దరితో మాట్లాడారని, మోదీ కాకుండా మరెవరైనా ప్రధాని అభ్యర్థి అయితే ఎన్డీయేకు మెజారిటీ వస్తుందని అన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

దీంతో చంద్రబాబు సాగిస్తున్న లోపాయికారి మంతనాలకు స్వస్తి చెప్పాలని.. ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి బీజేపీ కీలక నేతలకు సందేశం అందింది. ‘టీడీపీతో బీజేపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి’అనేది ఆ సందేశం సారాంశం. బీజేపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఓ నేత.. బాబుకు లోపాయికారి మద్దతు ఇచ్చినట్లు ఆరెస్సెస్‌ గుర్తించింది. బీజేపీ క్రమశిక్షణకు మారుపేరని, ఈ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం సరికాదంటూ.. బీజేపీ సీనియర్‌ నేతలు ఇటీవల పార్టీ సమావేశంలో మండిపడ్డారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement