కాయల్ని కోసే పట్టకర్ర
చెట్టుకున్న కాయల్ని కోయడంతో పాటు కొమ్మలను కత్తిరించేందుకు అనువైన పట్టకర్ర (కట్టింగ్ ప్లయిర్) పరికరం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది పూణేసమీపంలోని పబల్‌కు చెందిన విజ్ఞానాశ్రమం. కాయల్ని కోసేందుకు రైతులు పొడవైన చేతికర్ర లేదా వెదురు కర్రలను ఉపయోగిస్తారు. కాయల్ని కొట్టే సమయంలో దెబ్బల తాకిడికి పక్వానికి రాని కాయలు కూడా రాలిపోతుంటాయి. చిటారు కొమ్మల్లో కాయలను కోసేందుకు వీలుకాక వదిలేస్తుంటారు. చెట్లపైకి ఎక్కి దిగడంతో కొమ్మలు విరిగి దెబ్బలు తగిలే ప్రమాదంతో పాటు పంటనష్టపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పద్ధతుల వల్ల రైతు కూడా ఆర్థికంగా నష్టపోతుంటాడు. ఇటువంటి సమస్యల్ని అధిగమించేలా ఓ పట్టకర్రను తయారు చేసింది విజ్ఞాన్ ఆశ్రమం.
ఈ పట్టకర్రతో కాయల్ని కోయటం వల్ల పంట నష్టాన్ని నివారించటంతో పాటు సమయమూ కలిసివస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ సేపు కాయలు కోయగలుగుతారు. తుఫాన్‌లు, ఈదురుగాలులు వచ్చే సందర్భాల్లో త క్కువ మంది కూలీలతోనే త్వరగా కోతను పూర్తి చే యవచ్చు. నారింజ, మామిడి వంటి ఉద్యాన పంటల్లో అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను, తెగుళ్లు సోకి ఎండిపోయిన కొమ్మలను కత్తిరించేందుకు ఈ పట్టకర్ర ఉపయోగపడుతుంది.
అల్యూమినియం పైపుకు పై భాగంలో కాయల్ని కత్తిరించేందుకు వీలుగా పట్టకర్రను పైప్ కింది భాగంలో పట్టుకునే పిడికిలి వద్ద మోటార్ సైకిల్ లివర్‌లను వెల్డింగ్ చేశారు. ఈ రెంటినీ క్లచ్ వైరుతో అనుసంధానించారు. పిడికిలి వద్ద క్లచ్‌ను నొక్కగానే పట్టకర్ర చీలికలు కాయ తొడిమలను క త్తిరిస్తాయి. కత్తిరింపు పూర్తవగానే ఈ చీలికలు రెండూ వాటంతటవే యథాస్థానానికి వచ్చేలా అధిక ఒత్తిడితో పనిచేసే స్ప్రింగ్‌ను పట్టకర్రకు అమర్చారు. దీని తయారీకి 10-12 అడుగుల పొడవైన అల్యూమినియం పైపు, పట్టకర్ర, స్ప్రింగ్, క్లచ్ వైర్, మెటార్ సైకిల్ లివర్, మూడు బోల్ట్‌లు అవసరమవుతాయి. స్థానికంగా ఉండే మోకానిక్ షెడ్‌లలో రైతులే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్