సేంద్రియ వ్యవసాయమే శరణ్యం | Sharon organic farming ' | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయమే శరణ్యం

Published Wed, Oct 1 2014 11:52 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

సేంద్రియ వ్యవసాయమే శరణ్యం - Sakshi

సేంద్రియ వ్యవసాయమే శరణ్యం

భారత్‌లో ఉన్న వైవిధ్యాన్ని బట్టి రైతులు వివిధ పంటలు పండించగలరు. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఒకే రకమైన పంటను రుద్దుతోంది. ఇది మన ఆహార భద్రతకు ప్రమాదం. అనాదిగా మన రైతాంగం వృద్ధి చేసుకున్న స్వజాతీయ వంగడాలన్నీ కనుమరుగైపోతున్నాయి. జీవ వైవిధ్యం ధ్వంసమౌతున్నది.
 
సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల కోసం ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోంది. కానీ మన వ్యవసాయం ఏ దిశగా నడు స్తోంది? ఇక్కడ జరిగిన వ్యవసాయోత్పత్తులలో రసాయనాలు పరిమితికి మించి ఉంటున్నాయన్నది తీవ్రమైన ఆరోపణ. అందుకే మన పంట దిగుబడులను అమెరికా, యూరోపియన్ యూనియన్ నిషేధించాయి కూడా. మనం పండిస్తున్న పళ్లు, కూరగాయలలో నిషేధించిన హానికరమైన రసాయనాలు ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనంలోనూ వెల్లడైంది. అనేక దేశాలలో నిషేధానికి గురైన సింథటిక్ పైరిత్రాయిడ్స్‌ను మన రైతులు వినియోగించడం వల్ల మన పొలాల నుంచి వచ్చిన పళ్లు, కూరగాయలంటే చాలా దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది. ఎండోసల్ఫాన్‌తో జరిగిన రాద్ధాంతం కూడా మన వ్యవసాయోత్పత్తులకు ఎంతో హాని చేసింది.

రెండు విధానాలకు మధ్య ఎంతో తేడా

రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల సాయంతో పండించిన ఆహారోత్పత్తులపైనా; జన్యుమార్పిడి పంటలపైనా జరిగిన అనేక అధ్యయనాలు కలత రేపే ఫలితాలను మన ముందు ఉంచాయి. అలాంటి పంటల వినియోగం వల్ల ప్రజా రోగ్యం, పర్యావరణం తీవ్రంగా నష్టపోతాయి. అందుకే విశ్వ వ్యాప్తంగా ఇలాంటి వ్యవసాయోత్పత్తుల మీద తీవ్ర వ్యతిరేకత ప్రబలుతోంది. సేంద్రియ ఉత్పత్తుల మీద న్యూకాసిల్ విశ్వవిద్యాలయం (బ్రిటన్) 343 అధ్యయనాలు జరిపి, ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. సేంద్రియ ఆహారంలో 69 శాతం కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని వారు తేల్చారు. అలాగే కేడ్మియం, లిడ్, మెర్క్యురీ వంటి భారీ లోహాలు కూడా సేంద్రియ పంటలలో తక్కువగా ఉన్నాయని తేలింది. రసాయనిక ఎరువులతో దిగుమతి అయిన వ్యవసాయోత్పత్తులతో పోల్చి చూసినపుడు సేంద్రియ పంటలలో నైట్రోజన్ 10 శాతం, నైట్రేట్‌లు 30 శాతం, నైట్రైట్‌లు 87 శాతం తక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి.

భవిష్యత్తు సేంద్రియ పంటలదే

సేంద్రియ పద్ధతులలో పండించిన పంటలకు రోజు రోజుకూ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. డెన్మార్క్‌లో 10 శాతం ఆహార ఉత్పత్తులన్నీ సేంద్రియ వ్యవసాయంతో పండించినవే. అమెరికాలో 5 శాతం ఆహార ఉత్పత్తులు అవే. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లు. ఒక్క యూరప్‌లోనే వాటి మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లు. సేంద్రియ ఉత్పత్తుల  మార్కెట్ సాలీనా 20 శాతం పెరుగుతోంది. 2016 సంవత్సరానికి ఈ మార్కెట్ విలువ 104.5 బిలియన్ డాలర్లకు చేరుతోంది. ఇక 2020 కల్లా 200 బిలియన్ డాలర్లు దాటిపో తుందని అంచనా. భారతదేశంలో కూడా సేంద్రియ ఉత్పత్తుల మీద ఆసక్తి పెరుగుతోంది.

కనుమరుగ వుతున్న దేశీయ విత్తన సంపద

వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం, వ్యవసాయాన్నే వ్యవసాయ కార్పొరేషన్లకు మార్కెట్‌గా తయారు చేస్తోంది. పంట విత్తిన దగ్గర నుంచి నూర్చే వరకు ఆ కార్పొరేషన్ల మీద రైతు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదివేల మంది విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఉన్నట్టు అంచనా. హరిత విప్లవంతో మొదలైన కార్పొరేట్ పారిశ్రామిక వ్యవసాయంతో రైతుల ఆత్మహత్యలు, వాతావరణ కాలుష్యం వంటి దుష్పలితాలు సంభవించాయి. ప్రపంచ ఆహార సంస్థ అంచనా ప్రకారం ఒక్క ఆసియాలోనే 50 కోట్ల మంది రైతులు అర్ధాకలితో గడుపుతున్నారు. భారత్‌లో ఉన్న వైవిధ్యాన్ని బట్టి రైతులు వివిధ పంటలు పండించగలరు. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఒకే రకమైన పంటను రుద్దుతోంది. ఇది మన ఆహార భద్రతకు ప్రమాదం. అనాదిగా మన రైతాంగం వృద్ధి చేసుకున్న స్వజాతీయ వంగడాలన్నీ కనుమరుగైపోతున్నాయి. జీవ వైవిధ్యం ధ్వంసమౌతున్నది. బీటీ పత్తి వచ్చిన కొద్దికాలానికే దేశీయమైన పత్తి విత్తనాలన్నీ కనుమరుైగైనాయి. ఇప్పుడు బీటీ తప్ప ఇతర పత్తిని పండించే అవకాశమే లేదు. ఇలాంటి దుస్థితి ఇతర పంటలకు పట్టకుండా చూడాలి. ఇప్పటికైనా మన పాలకులు స్పృహలోకి వచ్చి స్వజాతి విత్తనాలను అభివృద్ధి పరచాలి. రైతులు ఇతర విత్తనాల కోసం పడిగాపులు కాచే పరిస్థితి నుంచి విముక్తం చేసి, వారే విత్తనాలను ఎగుమతి చేయగల స్థితికి తీసుకురావాలి. రైతుకు అనుకూలమైన విత్తన చట్టాన్ని తీసుకురావాలి. మేధో సంపత్తి హక్కులను రైతులకు అనుకూలంగా మలచవలసిన అవసరం ఉంది.

ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే సాధ్యం

సేంద్రియ వ్యవసాయం విస్తరించాలన్నా, ఆ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రభుత్వ చొరవతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ రసాయన ఎరువుల, క్రిమి సంహారక మందుల కంపెనీలకే అందుతున్నాయి. జాతీయ ఉద్యానవన మిషన్ సేంద్రియ వ్యవసాయానికి ఇచ్చే రాయితీ రూ. 22 వేలు. ఇందులో అధిక భాగం రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలకే పోతోంది. ఇదే సంస్థ సేంద్రియ వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ హెక్టార్‌కు ఏడు వేల నుంచి  పదివేల రూపాయలు. ఇది చాలదన్నట్టు సేంద్రియ వ్యవసాయ సబ్సిడీ పథకాలన్నీ వ్యవసాయ కమతాన్ని ఒక యూనిట్‌గా కాకుండా ఒక పంటను యూనిట్‌గా తీసుకుంటున్నాయి. ఇది వ్యవసాయ విధానానికే విరుద్ధం. ఇంకా ప్రభుత్వ సాయంతో సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలి. ఈ సర్టిఫికేషన్ కోసం రైతులు కంపెనీలకు పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించవలసి రావడం మరో విషాదం. సేంద్రియ వ్యవసాయం విస్తరించాలంటే ఈ సర్టిఫికేషన్ విధానం తొలగించాలి. పంటల వారీగా కాకుండా వ్యవసాయ కమతాన్ని లేదా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలి. వైవిధ్యమైన పంటలు, పంట మార్పిడి, సమగ్ర సస్యరక్షణ, వ్యవసాయానుబంధ రంగాలు పశుపోషణ, పంచగావ్య, జీవామృతం వంటి సేంద్రియ ఎరువుల తయారీ వంటివాటన్నింటికి ప్రోత్సాహం ఇవ్వాలి.

అపోహలను తొలగించాలి

సేంద్రియ వ్యవసాయం ప్రపంచ ఆహార సమస్యకు పరిష్కారం కాదనీ, ఆకలి తీర్చలేదనీ ప్రచారం ఉంది. ఈ పద్ధతితో దిగుబడులు తగ్గుతాయన్న దుష్ర్పచారం కూడా ఉంది. కానీ ఇవన్నీ అబద్ధాలని పరిశోధనలు చెబుతున్నాయి. రసాయన ఎరువులతో చేసే సేద్యంలో కంటే సేంద్రియ వ్యవసాయం వల్ల  దిగుబడులు పెరుగుతాయని, భూసారం కూడా వృద్ధి అవుతుందని బ్రిటన్‌కు చెందిన బ్రాడ్ బాక్ పరిశోధనలో తేలింది. ఆ రెండు వ్యవసాయ పద్ధతులలో ఏది మేలు అన్న అంశం మీద బ్రాడ్ బాక్ 50 ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తోంది. అమెరికాలో ఆరు విశ్వవిద్యాలయాలలో జరిగిన పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని ఏకగ్రీవంగా వెల్లడించాయి. బీహార్‌లోని నలందా జిల్లాలో ఇద్దరు రైతులు శ్రీవరి సాగులో సేంద్రియ ఎరువులను ఉపయోగించి హెక్టార్‌కు 120 క్వింటాళ్లు దిగుబడి సాధించారు. ఇది ప్రపంచ రికార్డు కూడా. భాస్కర్ సావే వంటి ఆదర్శ రైతులు సేంద్రియ విధానాల ద్వారా అధిక దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు. సుభాష్ పాలేకర్ వ్యాప్తిలోకి తెచ్చిన గోవు ఆధారిత వ్యవసాయానికి కూడా మంచి స్పందన లభించింది. మన రాష్ట్రంలో కూడా ఎందరో రైతులు దేశీయ ఆవుల సాయంతో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా రసాయన ఎరువులతో చేసే సేద్యానికి  ఇస్తున్న సబ్సిడీలో సేంద్రియ వ్యవసాయానికి దక్కుతున్న సబ్సిడీ 1 శాతమే. ఈ బడ్జెట్‌లో కూడా దీనికి నిధులు అంతంత మాత్రమే ఇచ్చారు. అది కూడా ఈశాన్య రాష్ట్రాలకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఈ ధోరణి మారాలి. సేంద్రియ వ్యవసాయంతో సామాజిక ఆర్థిక లక్ష్యాలు నెరవేడంతో పాటు, ఆహార భద్రత, ఆహార సార్వభౌమాధికారాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. అదే నిజమైన హరిత విప్లవం.
 
(వ్యాసకర్త జాతీయ ఆయిల్‌పామ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి)  -  డా॥ కె. క్రాంతి కుమార్ రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement