రైతు రక్షణ ఇక కోర్టుదే! | The court will protect farmers care | Sakshi
Sakshi News home page

రైతు రక్షణ ఇక కోర్టుదే!

Published Tue, Dec 30 2014 1:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM

రైతు రక్షణ ఇక కోర్టుదే! - Sakshi

రైతు రక్షణ ఇక కోర్టుదే!

రెండేసి, మూడేసి పంటలకూ, ఉద్యానవన శోభకూ ఆలవాలమైన భూములను వదులుకోవడానికి సిద్ధంగాలేమని ఆయా ప్రాంతాల రైతులు ప్రకటించారు. అధికారులు రావడానికి వీలులేదని చె ప్పే బ్యానర్లను అనేక గ్రామాల శివార్లలో కట్టారు. ఈ పరిణామం రాష్ట్ర పాలకవర్గానికి రుచించలేదు. ఈ నేపథ్యంలోనే; రైతాంగానికీ, వారి పంటలకూ అర్ధరాత్రి జరిగిన అపార నష్టం గురించి  రాష్ట్ర గౌరవ ఉన్నత న్యాయస్థానం తక్షణం జోక్యం చేసుకోవాలి. 

‘‘న్యాయమూర్తుల రాజ్యాంగ విహితమైన దృష్టికోణం ప్రకాశవంతం గానూ, ద్వంద్వార్థాలకు తావు లేనిదిగానూ ఉండాలి. వారి లక్ష్యం, కార్యాచరణ, ప్రజా శ్రేయస్సు పరిరక్షణగానే ఉండాలి. కాని ఈ కార్యనిర్వహణ అనేక సంద ర్భాలలో హేతు విరుద్ధంగానూ విచక్షణారహితంగానూ ధనికుల ప్రయోజ నాలకు అనుకూలంగానూ పేద ప్రజా బాహుళ్యాలకు వ్యతిరేకంగానూ ఉంటోంది. ఈ పరిస్థితి మారాలి’’.
- జస్టిస్ కృష్ణయ్యర్ (ఫ్రం బెంచ్ టు బార్)
 ఆ ధర్మాసన చైతన్యం మరొక్కసారి ప్రస్ఫుటం కావలసిన సమయం ఆసన్నమైంది.
 
 ఇదేం మొండివైఖరి?
 ఈ ఏడాది జూన్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో ఉన్న తెలుగుజాతి, విభ జన తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొనబోతున్నదో శివరామకృష్ణన్ కమిటీ ముందే హెచ్చరించింది. పరిశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం నియమించిన ఈ కమిషన్ కోస్తాలోని కొన్ని (విజయవాడ-గుంటూరు బెల్ట్) ప్రాంతాలు  కొత్త రాజధానికి ఎందుకు అనుకూలం కాదో వివరించింది. అయినా, ముఖ్యమంత్రి అయిన తరువాత నారా చంద్రబాబునాయుడు అను సరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారింది. కొత్త రాజధాని విషయంలో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని ప్రజలను నమ్మించడానికి ఆయన శతథా ప్రయత్నిస్తున్నారు.
 
  ఈ ప్రయత్నంలోనే  ‘బ్రూట్ మెజారిటీ’ ఆధారంగా శాసన సభలో రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఏర్పాటును ఖాయం చేస్తూ బిల్లును ఆమోదింపచేశారు. ఈ విషయంలో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రతిపక్షవాణిని అణచివేస్తూ అధికారపక్షం ఈ బిల్లును ఆమోదించింది. బిల్లు మాటెలా ఉన్నా విజయవాడ-గుంటూరు- తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి స్థలం వెతుకులాట తంతు మాత్రం పూర్తికాలేదు. అది తేలకే సింగపూర్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజ కీయ చట్టా వ్యాపారులు పాలక వర్గాల ఆశీస్సులతో ముందస్తు లీకులతో ఆయా ప్రాంతాల పంట భూములపై విరగపడిపోతున్నారు. ప్రభుత్వం కూడా  కోట్లు ఎర చూపి పంట భూములను సేకరణ పేరిట, సమీకరణ పేరిట రైతాంగం మీద తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇదంతా చివరికి దేనికి దారి తీస్తుంది?
 
 న్యాయస్థానం ఆదుకోవాలి

 రాజధాని నిర్మాణం కోసం పంటభూముల జోలికి ఎట్టి పరిస్థితులలోనూ పోరా దనీ, ఆహార భద్రతకు ఆలవాలంగా ఉన్న దేశ ధాన్యాగారాలను దుర్వినియోగం చేయరాదనీ కేంద్ర నిపుణుల కమిటీ ముందే హెచ్చరించిన సంగతిని విస్మరిం చరాదు. మెరక భూములను, ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉండే భూము లను రాజధాని నిర్మాణానికి ఉపయోగించుకోవాలని సూచించిన సంగతిని కూడా గుర్తు చేసుకోవాలి. అందుకు తగినట్టుగానే రెండేసి, మూడేసి పంట లకూ, ఉద్యానవన శోభకూ ఆలవాలమైన భూములను వదులుకోవడానికి సిద్ధంగాలేమని ఆయా ప్రాంతాల రైతులు ప్రకటించారు. అధికారులు రావడా నికి వీలులేదని చె ప్పే బ్యానర్లను అనేక గ్రామాల శివార్లలో కట్టారు. ఈ పరిణా మం రాష్ట్ర పాలకవర్గానికి రుచించలేదు. ఈ నేపథ్యంలోనే; రైతాంగానికీ, వారి పంటలకూ అర్ధరాత్రి జరిగిన అపార నష్టం గురించి  రాష్ట్ర గౌరవ ఉన్నత న్యాయస్థానం తక్షణం జోక్యం చేసుకోవాలి. ఈ నెల 29న ప్రసార మాధ్య మాలలో వెల్లడైనట్టు వీజీటీఎం పరిధిలో భాగమైన మంగళగిరి చుట్టుపక్కల 8 గ్రామాలలో ఉండవల్లి, పెనుమాక, మఠపల్లి మండలం పెదవీడు, పెదరాయని పాలెం ప్రాంతంలో రైతాంగం ఎందుకు తీవ్రమైన అలజడికి లోనుకావలసి వచ్చిందో న్యాయస్థానం ఆ వార్తల ఆధారంగా ‘సుమోటో’గా సమగ్ర విచార ణకు ఆదేశించవలసిన సమయమిది. నిజానికి భూసేకరణ చట్టం పంట భూములను తీసుకోవడానికి ఆమోదించదన్న స్పృహ కూడా పాలకులకు లేదు.
 
 ఇదేం దుర్మార్గం?
 పంటభూములకు జరిగిన తీవ్ర నష్టం అంతా ఇంతా కాదు. కొన్ని దశాబ్దాల క్రితం గ్రామ రాజకీయ కక్షలలో భాగంగా గడ్డివాములు, వరికుప్పలు తగుల బెట్టుకోవడం ఒక దురలవాటుగా సాగింది. అంతేగాని, పండ్లతోటలను, పంట పొలాలను తగలబెట్టి ధ్వంసం చేయడం రాజధాని రగడ మొదలైన తర్వాతనే వచ్చిన దుర్మార్గపు పరిణామం. పైగా అర్ధరాత్రి వేళ రాజధాని ప్రతిపాదిత  ప్రాంతాలలోని పంటభూములను, పంటలను, తోటలను ధ్వంసం చేయవల సిన అవసరం ఎవరికి కలిగి ఉంటుంది? రైతులు నిద్రావస్థలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడిన నేరగాళ్లు ఎవరై ఉంటారు? ఇందుకు సమాధానం- బహుశా,  తమ పంటపొలాలను ‘సేకరణ/ సమీకరణ’కు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ రైతులయితే అడ్డుకున్నారో, అలాంటి వారికి గుణపాఠం చెప్పాలని భావించిన వారే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారా? ఇది కాకుంటే, మరి ఎవరి పనై ఉండాలి? ఈ ప్రశ్నకు గౌరవ న్యాయస్థానం ‘సుమోటో’ ద్వారా సమాధానం రాబట్టవలసి ఉందని అనిపిస్తుంది.
 
 రైతు రక్షణ నానాటికీ తీసికట్టు
 పంటభూములను బలవంతంగా సమీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న సంఘాల సభ్యులు, కొందరు ప్రజాప్రతినిధుల అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చాయి. దొంగే, ‘దొంగ..దొంగ’  అని అరిచి, ఎవరి మీదకో దృష్టి మళ్లించి,  తాను మాత్రం తప్పించుకున్నట్టే, అమాయకులు పోలీ సులకు దొరికిపోవడం ప్రజలకు అనుభవమే. ఇప్పటిదాకా ఎన్నికలలో నెగ్గు కొచ్చేందుకు ఒక రాజకీయ పక్షం నాయకుడు రైతు రుణాలన్నింటినీ రద్దు చేస్తా ననీ, అంతవరకు బ్యాంకులకు బకాయిలు చెల్లించవద్దనీ వాగ్దానం చేసి గెలి చాడు. రూ.80,000 కోట్లు రుణభారంగా మోయవలసి ఉంది. కాని ప్రస్తు తానికి చెల్లించేది మాత్రం రూ.5,000 కోట్లేనని ప్రకటించడమూ జరిగింది. నిజానికి పాలకుల మెడకు గుదిబండలా తగులుకున్న ఈ రుణ భారం రాజధాని నిర్మా ణానికి కూడా ఉచ్చుగానే తగులుకుంటోంది. చరిత్ర పరిశీలించిన వారికి 1939లోనే ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు చౌదరి చరణ్‌సింగ్ (మాజీ ప్రధాని) రుణ విమోచన కోసం ఒక బిల్లును ప్రతిపాదించాడు. అలాంటి బిల్లును నేటి నాయకులు ప్రవేశపెట్టకుండా, రాజధాని కోసం నిర్బంధంగా ఒక ప్రాధికార సంస్థ ఏర్పాటు కోసం మాత్రం హడావుడిగా బిల్లును తీసుకువచ్చి చివరికి బ్రిటిష్ వలస పాలనలో సహితం, అన్ని ఆధునిక శాసన వేదికలలోనూ రైతు రుణ విమోచన చట్టాలు వచ్చాయి.
 
  వాటిలో ప్రధానమైనవి- మద్రాసు రాష్ట్ర రుణ విమోచన చట్టం (1936, సెక్షన్ 16), బొంబాయి వ్యవసాయదారుల విమోచన చట్టం (సెక్షన్-39), దక్కన్ రైతాంగ విమోచన చట్టం (1879-సెక్షన్ 30). 1918 నాటి రుణచట్టం కింద తెలుగురైతులకు రక్షణ లేదు కాబట్టే, 1938లో వ్యవసాయ రుణాల తీర్మానానికి ఆ సంవత్సరమే ఒక చట్టం వచ్చింది. పైగా వ్యవసాయ భూముల అభివృద్ధికి ప్రభుత్వ నిధులను వెచ్చించే అధికా రాలు బ్రిటిష్ హయాంలోనే సంక్రమించాయి. ఇందులో భాగంగానే దక్కన్ చట్టాలు కొన్నింటిని ఇతర ప్రావిన్సెస్‌కు విస్తరించడమూ జరిగింది. ఇవి పునాదిగానే 1884లో వ్యవసాయ భూముల అభివృద్ధి చట్టంతో పాటు రుణ సౌకర్య కల్పనకు కూడా చట్టాలు వచ్చాయి. కాగా ఈనాడు ఉన్న చట్టాలను సద్వినియోగం చేయకపోగా బ్యాంకుల జాతీయీకరణ చట్టం కింద సన్నకారు, మధ్య తరగతి రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు ఒనగూడిన ఆ నామ మాత్రపు రుణ సౌకర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా వాతావరణాన్ని పాలకులు మార్చేశారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా రైతులు చెల్లించవలసిన బ్యాంకు రుణాలపైన వడ్డీ వెసులుబాటుకు ప్రయత్నించిన నాయకుడు ఎవరూ లేరు. సుప్రీంకోర్టు కూడా చౌదరి తీర్పును కొట్టివేసింది. అప్పటికీ ఇప్పటికీ దళారీలదే రాజ్యం.
 
సర్కారు పలాయనం చిత్తగించింది కాబట్టి...
 ఒక వైపున వడ్డీ వ్యాపారులు, మరొకపక్క బ్యాంకులు, ఇంకొక వైపు నుంచి భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సామాన్య, మధ్యతరగతి రైతాం గం పట్ల జలగల్లా తయారయ్యారు. అందువల్ల రైతుల పంట భూములను, పంటలను స్వార్థప్రయోజనాల కోసం కక్షతో తగలబెట్టి, ఆహార భద్రతకు స్వయం పోషక ఆర్థికవ్యవస్థకు చేటుగా మారిన శక్తులను రాష్ట్ర అత్యున్నత స్థానం తెగువతో అదుపుచేయడానికి ముందుకు రావాలి. జస్టిస్ కృష్ణయ్యర్ ఆశను మరింత చిగురింపచేయాలి. రైతాంగ రక్షణ బాధ్యత నుంచి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది కాబట్టి, ఆ బాధ్యతను గౌరవ న్యాయస్థానం తలకెత్తు కోవడం అనివార్యం. కాగా రైతులే తమ పంటలను ధ్వంసం చేసుకున్నారని, ఇందులో ప్రతిపక్ష నేత ప్రమేయం కూడా ఉందని రాష్ట్ర మంత్రి ఒకరు వాగడం దీనికి కొసమెరుపు. ఇలాంటి వాచాలత్వానికి ప్రజలే సమాధానం చెబుతారు.
 (వ్యాసకర్త మొబైల్: 98483 18414)
 ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement