హత్య చేసి న్యాయం చేయమని అడుగుతున్నారు | Bhumana Karunakar reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

హత్య చేసి న్యాయం చేయాలని అడుగుతున్నారు

Published Wed, Jul 4 2018 12:22 PM | Last Updated on Sat, Aug 11 2018 4:08 PM

Bhumana Karunakar reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దీక్షల పేరుతో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని నిలువునా ముంచిన టీడీపీ నేతలు దీక్షలు చేయడం హత్య చేసిన వ్యక్తులే బాధితులకు న్యాయం చేయాలని అడిగినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. విభజన హామీల కోసం వైఎస్సార్‌సీపీ నేతలు పోరాటం చేస్తే ఎద్దేవా చేశారని, నాలుగేళ్లపాటు కేంద్రంతో అంటకాగి ఇప్పుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనుచరులతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని, సురభి నాటకాల కంపెనీ కూడా చేయలేని విధంగా డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రజా అవసరాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడమే చంద్రబాబు నైజమని భూమన విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఏమాత్రం చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని తాము నిరూపిస్తామని, చర్చకు చంద్రబాబు సిద్దమా అని సవాల్‌ విసిరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్‌ బయట దొరుకుతుందని, కానీ టీడీపీ ఎన్నికల మేనిఫిస్టో మాత్రం దొరకదని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. 87 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఏమైందని, నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 

కేంద్రం అన్నీ చేస్తోందని ప్రచారం చేసి.. ఇప్పుడు అన్యాయం చేసిందని మొసలి కన్నీరు కారుస్తున్నారని కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. రైల్వే జోన్‌ ఉక్కు ఫ్యాక్టరీ, పెట్రో కాంప్లెక్స్‌, చెన్నై విశాఖ కారిడార్‌లను ఆరునెలల్లో పూర్తి చేయాలని గెజిట్లో ఉన్నా కూడా, కేంద్రంలో ఉండి విభజన హామీలను విస్మరించారని మండిపడ్డారు. నాలుగేళ్లలో రూ.4లక్షల కోట్లు దోచుకున్నారని, దేశమంతా తెలుగుదేశం పార్టీ గజదొంగ  పార్టీ అని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు ఇస్తే రాష్ట్రానికి అన్నీ సాధిస్తామంటున్నారని, ఇప్పుడు 20 మంది ఉన్నా ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు లాంటి మోసకారి స్వాతంత్ర్య పోరాటంలో ఉండి ఉంటే దేశానికి ఇప్పటి వరకూ స్వాతంత్ర్యం వచ్చేది కాదని విమర్శించారు.

బీజేపీతో చంద్రబాబు లోపాయికారి పొత్తులు పెట్టుకున్నారని, బయటకు మాత్రం వ్యతిరేకమని నటిస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు బీజేపీ-టీడీపీ మోసాలపై పోరాటం చేస్తుంటామని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో లోకేష్‌ను సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ చంద్రబాబు పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే రాక్షస పాలనను అంతమొందిస్తామని భూమన చెప్పారు. దీక్షతో ఐదు కేజీలు తగ్గాలని దీక్ష చేయడం రాష్ట్రంపై వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని భూమన స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement