సాక్షి, హైదరాబాద్: అమరావతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తరలించడం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కేసుల విచారణలో జాప్యానికేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను చూస్తుంటే వాటి వెనుక కుట్ర దాగి ఉందా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీ హైకోర్టు తరలింపు కోసం హడావుడి చేసి తీరా అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాక జగన్‌పై నిందలు మోపడాన్ని చూస్తుంటే చంద్రబాబు అంతర్లీన ఆలోచనలు బట్టబయలవుతున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతను ఎప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉండొచ్చు.. కేసులు త్వరగా విచారణకు రాకుండా చేయవచ్చు.. జగన్ తదితరులకు క్లీన్ చిట్ రాకుండా అడ్డుకోవాలనే కుట్రపూరిత ఆలోచన చంద్రబాబుకు ఉన్నట్లు తేటతెల్లమవుతోందని స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు తరలింపుపై ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే చంద్రబాబు తన లోపల దాచుకున్న కుట్రపూరిత ఆక్రోశాన్నంతా అందుకనే వెళ్లగక్కారని విశ్లేషిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు కోరితేనే హైకోర్టు తరలింపు ప్రక్రియ ఈ దశ వరకు వచ్చింది. అయితే చంద్రబాబు ఇప్పుడు హైకోర్టు తరలింపు జగన్ కేసుల విచారణలో జాప్యానికేనంటూ మాట్లాడటంపై న్యాయ ప్రముఖులు విస్మయం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పై చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనలకు ఆయన ఈ తాజా వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. లేకుంటే ఆయనే హైకోర్టు తరలింపును కోరి, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మదిలో జగన్‌ను అణగదొక్కాలన్న కుట్రపూరిత ఆలోచనలు ఉండటం వల్లే చంద్రబాబు నోటి నుంచి ఆ మాటలు అప్రయత్నంగానే వెలువడ్డాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
అడుగడుగునా అణచివేసే యత్నం..
సీఎం చంద్రబాబు గతంలో కూడా వైఎస్ జగన్ విషయంలో పలుమార్లు ఇలాగే వ్యవహరించారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ రాజకీయ భవిష్యత్తును సమాధి చేసేందుకు ఆయన అడుగడుగునా ప్రయత్నిస్తూ వచ్చారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూడలేక కాంగ్రెస్‌తో తెర వెనుక మంత్రాంగం నడిపి శంకర్రావు చేత చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించిన విషయాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? ఆ తరువాత ఎందుకైనా మంచిదని తమ పార్టీ నాయకులను కూడా రంగంలోకి దించి వారితో కూడా జగన్‌పై మరో పిటిషన్ దాఖలు చేయించిందీ చంద్రబాబే అని పేర్కొంటున్నారు.
చీకట్లో చిదంబరాన్ని కలవలేదా?
నాడు కష్టకాలంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకుని ఆ పార్టీతో తెర వెనక స్నేహాన్ని చంద్రబాబు నిరూపించుకున్నారు. అసెంబ్లీలో మెజారిటీ లేని సమయంలో విప్ జారీ చేసి మరీ తమ శాసన సభ్యులను విశ్వాస పరీక్షకు హాజరు కాకుండా చేసి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. బాబు అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రాథమిక దర్యాప్తు జరపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించినప్పుడు చీకట్లో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంను కలిసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత హైకోర్టులో ‘నాట్ బిఫోర్’అంకంతో సీబీఐ దర్యాప్తు నుంచి చంద్రబాబు బయటపడ్డ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు కాంగ్రెస్‌తో తెర వెనుక సాగిస్తున్న స్నేహాన్ని తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెరపైకి తీసుకొచ్చారు. 30 ఏళ్లకు పైగా ఉన్న సైద్ధాంతిక విబేధాలను పక్కన పెట్టేసి అప్రజాస్వామికంగా కాంగ్రెస్‌తో చెలిమి చేశారు. చివరకు తెలంగాణ ప్రజలు ఇరుపక్షాలను ఛీ కొట్టి పంపారు. ఇంత జరిగినా ఇప్పుడు మళ్లీ ఏపీ హైకోర్టు తరలింపు విషయంలో చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు. జగన్ కేసుల విచారణలో జాప్యానికే ఇంత త్వరగా హైకోర్టును విభజన చేశారంటూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
15కల్లా సిద్ధం అంటూ హామీ ఇచ్చి..
ఎన్నికలు సమీపించిన సమయంలో జస్టిస్ సిటీ అంటూ ఊదరగొట్టిన శాశ్వత హైకోర్టును పక్కన పెట్టేసి తాత్కాలిక హైకోర్టును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నేలపాడులో తాత్కాలిక భవనం పనులు ప్రారంభించారు. అటు తరువాత హైకోర్టు ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డిసెంబర్ 15కల్లా నేలపాడులో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తి అవుతుందంటూ అక్టోబర్ 30న హామీ ఇచ్చింది. న్యాయమూర్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ చెప్పింది. తమ హైకోర్టులో తాము పనిచేసుకుంటామని, మరో రాష్ట్ర భూ భాగంపై ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
వాస్తవాలు చెబితే మరోలా పరిస్థితి...
చంద్రబాబు ప్రభుత్వ హామీని విశ్వాసంలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. డిసెంబర్ 15కల్లా ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం పూర్తయిపోతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 2019 జనవరి 1కల్లా హైకోర్టు విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సిద్ధం చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15కల్లా భవనం సిద్ధమవుతుందంటూ తప్పుడు హామీ ఇవ్వకుండా, మార్చికల్లా పూర్తి చేస్తామని వాస్తవం చెప్పి ఉంటే నేడు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులకు ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇదే సమయంలో ఏపీ తాత్కాలిక హైకోర్టు అద్భుతస్థాయిలో నిర్మాణం జరుగుతోందని నమ్మించేందుకు ఢిల్లీలో ఏకంగా హైకోర్టు భవన నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సైతం చూపారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులను కూడా నేలపాడుకు తీసుకెళ్లారు. అందరూ ఉపయోగించే రోడ్ల ద్వారా కాకుండా ప్రత్యేక రహదారుల వెంట తీసుకెళ్లి అక్కడ ఉన్న సమస్యలేవీ వారి దృష్టికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
న్యాయమూర్తులను రోడ్డుపైకి తెచ్చిన బాబు..
స్వీయ, రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ అదే పంథాను అనుసరించారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఏ మాత్రం లేకపోయినా, డిసెంబర్ 15కల్లా సిద్ధం అవుతుందని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి ఇప్పుడు అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులను రోడ్డుపైకి తీసుకొచ్చారు. చివరకు ఎలాంటి సౌకర్యాలు లేని కోర్టులో పని చేయాల్సిన పరిస్థితిని వారికి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment