తమిళనాడు, పెరంబూరు: నటి గాయత్రి రఘురాం బీజేపీకి గుడ్‌బై చెప్పారు. జరుగుతున్న రాజకీయ పోకడలను దుయ్యపట్టారు. దివంగత ప్రముఖ నృత్యదర్శకుడు రఘురాం కూతురు గాయత్రిరఘురాం. 2002లో చార్లిచాప్లిన్ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తరువాత పలు చిత్రాల్లో నటించారు. యాదుమాగి నిండ్రాయ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు కూడా. కాగా 2017లో బిగ్‌బాస్ రియాలిటీ షో పోటీలో పాల్గొని పాపులర్ అయిన గాయత్రీరఘురాం వివాదాంశ చర్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ మధ్య రాష్ట్ర బీజేపీ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తిగతంగా పలు వివాదాల్లో చిక్కుకున్న గాయత్రీ రఘురాంను ఆ పార్టీ అధ్యక్షురాలు తమిళరసి సౌందరరాజన్ ఆమె తమ పార్టీలోనే లేరని పలుమార్లు చెప్పారు. దీనికి గాయత్రీ రఘురాం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొని మరోసారి వార్తల్లోకెక్కారు.
దీని గురించి గాయత్రి రఘురాం పేర్కొంటూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఇప్పుడు వాగ్వాదాలకు, కేవలం ఇతరులపై ఆరోపణలు చేయడం వంటి చర్యలతో దిగజారిపోయిందన్నారు. ఇలా పిల్లల గొడవలా రాజకీయాలు తయారయ్యాయని ఆరోపించారు. ఇక్కడ మార్గదర్శకంగా ఉండే అనుభవంతులైన నేతలు లేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా బాగు పడే లక్షణాలేవీ కనపడడం లేదని, మన దేశ తలరాతను మార్చగలమనే నమ్మకం తనకు కలగడం లేదని పేర్కొన్నారు. అందుకే తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందన్నారు. ఇందుకు తనకు తానే విచారం వ్యక్తం చేసుకుంటున్నానన్నారు. ఇది తన వ్యక్తగత అభిప్రాయం అని పేర్కొన్నారు. సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే అధికంగా నట చక్రవర్తులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నకలీ పోరాటయోధులు, నకిలీ నాయకులు, నకిలీ కార్యకర్తలే ఇక్కడ అధికం అని దుయ్యబట్టారు. అలా 24 గంటలు నటించడం తన వల్ల కాదని అన్నారు. సమయం వచ్చినప్పుడు తాను అంకితభావంతో, విశ్వాసంతో ఉంటానని చెప్పారు.
విలన్ పాత్ర మాదిరి
రాజకీయవాది అన్నది విలన్ పాత్రలా తయారైందన్నారు. దురాశ, కుయుక్తులు అంటూ అంతా తారుమారుగా మారిపోయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రస్తుతానికి బయట ఉండి అంతా గమనిస్తూ, పరిశోధన చేసి మరింత నేర్చుకోవాలని భావిస్తునట్లు చెప్పారు. అందుకే రాజకీయాలకు విరామం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాజకీయాల్లో ముమ్మరంగా దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు అన్నారు. అలాంటి సమయం వచ్చినప్పుడు చురుగ్గా పాల్గొంటానని, ప్రస్తుతానికి తానే పార్టీకి మద్దతు తెలపడం లేదని గాయత్రి రఘురాం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment