జంగ్‌ సైరన్‌ మోగింది! | KTR And Amit Shah Launched Lok sabha Election 2019 Campaign In Telangana | Sakshi
Sakshi News home page

జంగ్‌ సైరన్‌ మోగింది!

Published Thu, Mar 7 2019 3:37 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

KTR And Amit Shah Launched Lok sabha Election 2019 Campaign In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎండలు ముదురుతున్న వేళ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి కూడా ప్రారంభమైంది. షెడ్యూల్‌ నేడో, రేపో వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. పార్లమెంటరీ సన్నాహక సమావేశాలతో టీఆర్‌ఎస్, నిజామాబాద్‌లో జరిగిన అమిత్‌ షా బహిరంగసభ నుంచి బీజేపీ లోక్‌సభ కదనరంగంలోకి దూకగా.. ఈనెల 9న జరిగే రాహుల్‌ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది.

16 సీట్లే లక్ష్యంగా...
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈసారి రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాలు గెలవాల్సిందేనని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తగినన్ని సీట్లు సాధించాలనే ధ్యేయంతో ఆయన పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు తీసుకున్న కేసీఆర్‌ తనయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అప్పుడే రంగంలోకి దిగారు. కరీంనగర్‌ నుంచి శంఖారావాన్ని పూరించిన ఆయన పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు.

వరుసగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలకు ఆయన హాజరై క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఎన్నికల దిశగా సమాయత్తం చేయనున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం కేసీఆర్‌ ప్రారంభించారని తెలంగాణ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. దాదాపు పాతవారందరికీ మరోసారి అవకాశమిస్తారని, మూడు లేదా నాలుగు స్థానాల్లో మాత్రమే మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణ సత్తా జాతీయ స్థాయిలో చూపించాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలనే ప్రధాన నినాదంతో ఎన్నికలకు వెళ్లి ఢిల్లీ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌ కావాలనే తలంపుతోనే టీఆర్‌ఎస్‌ ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది.  

రాహుల్‌ను ప్రధాని చేయడమే ధ్యేయంగా...
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా లోక్‌సభ సమరానికి సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆ పార్టీ నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు సాధించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ మనుగడకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీంతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి కనీసం 10 సీట్లు గెలవాలనే వ్యూహంతో ముందుకెళుతోంది. అందులో భాగంగానే ఈనెల 9న రాహుల్‌గాంధీనే స్వయంగా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలో టీపీసీసీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. రాహుల్‌ రాష్ట్ర పర్యటన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసుకోనుంది. ఈనెల 10న ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం వారం, పదిరోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని దేశంలో మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తమను ఆదరించాలనే ప్రధాన నినాదంతోనే కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికలకు వెళ్లనుంది.

సంక్షేమ, అభివృద్ధి నినాదాలతో...!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిజామాబాద్‌ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మళ్లీ రెండోసారి మోదీ ప్రధాని కావాలనే ధ్యేయంతో.. ఉన్న ఒక్క సీటును నిలబెట్టుకోవడంతో పాటు లోక్‌సభలో పార్టీ తరఫున రాష్ట్ర ప్రాతినిధ్యం పెంచుకోవాలనే వ్యూహంతో కమలనాథులు ఈసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల ఖరారుపై పార్టీలో ఇప్పటికే ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయింది. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి లింబావళితో పాటు పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే సమావేశమై ఆశావహుల సమాచారం క్రోడీకరించారు.

అయితే, ఈసారి ఎన్నికల్లో మోదీ చరిష్మా ఏ మేరకు పనిచేస్తుందనే అంశం బీజేపీ వ్యూహరచనలో కీలకపాత్ర పోషించనుంది. మోదీ చరిష్మాతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 2014కు ముందు దేశం పరిస్థితిని, ప్రస్తుత పురోగతిని వివరిస్తూ ఎన్నికల్లో వీలున్నంత మేర లబ్ధి పొందడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్లనున్నారు.  

ఆ పార్టీలు ఎన్నిచోట్ల పోటీలో ఉంటాయో..?
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు వామపక్షాలు, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ఈ సారి ఎన్నికల్లో ఏ మేరకు పోటీ చేస్తాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డ టీడీపీ, సీపీఐలు మళ్లీ కూటమిలో ఉంటాయా..? లోక్‌సభ ఎన్నికల ద్వారా మళ్లీ సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కుదురుతుందా? జనసమితి అధినేత కోదండరాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనే అంశాల ఆధారంగా ఆయా పార్టీలు ఎన్ని చోట్ల, ఎక్కడెక్కడ బరిలో ఉంటాయనేది తేలనుంది. ఆ పార్టీల వైఖరి, వ్యూహాలు కూడా త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement