సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సమస్యల్ని తెలుసుకోవడం.. వ్యక్తిగత సమస్యలపైనా ఆరా తీసి పరిష్కరించడమే ప్రధాన అజెండాగా వైఎస్సార్ సీపీ నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ప్రజాదీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 27 నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల దీవెనలు కోరనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు, ముఖ్యులతో సమావేశమై అజెండాను ప్రకటించారు. ఇప్పటికే పార్టీ శ్రేణులతో కలిసి నగర పర్యటన చేసిన ఎమ్మెల్యే నవరత్నాల పథకాలను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను ప్రజలకు వివరించారు. దీని కొనసాగింపుగా ప్రజాదీవెన పేరుతో మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ఈశాన్య ప్రాంతమైన వేణుగోపాల్ నగర్‌లో శుక్రవారం ఉదయం ప్రజాదీవెన కార్యక్రమం ప్రారంభం కానుంది.
50 వేల ఇళ్లకు వెళ్లడం లక్ష్యం
నియోజకవర్గంలో మొత్తం సుమారు 50 వేల ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబంతో 15 నిమిషాలపాటు మాట్లాడి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించండని కోరనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు, లోపాలు, వారు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై చర్చించి అక్కడ నుంచి అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గడచిన మూడేళ్లలో నగర ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను చేసిన సేవలను, ప్రజల కోసం నిర్వహించిన ప్రజా పోరాటాలను కూడా ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. రోజూ సగటున 9గంటల పాటు ప్రజా దీవెన నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశారు. ప్రధానంగా నగరంలో డెంగీ, ఇతర జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. దీనిపై ప్రతిచోట ప్రజలతో మాట్లాడి అక్కడి ఇబ్బందులను వైద్య ఆరోగ్య శాఖ, నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. నగరంలో అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం, పరిష్కారం కాని పక్షంలో ప్రజలతో కలసి ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు.
6 నెలలు కొనసాగే అవకాశం
ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించి ముగింపులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు ఆరు నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నేతలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కొక్క డివిజన్‌లో సగటున 7 నుంచి 10 రోజులపాటు కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలు చెప్పిన సమస్యలను నమోదు చేసుకుని వాటి పరిష్కారమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కమిషనర్, ఇతర అధికారులకు పంపనున్నారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ నగర నేతలు కార్యక్రమంలో మమేకం కానున్నారు. ప్రతి డివిజన్‌లో ముగింపు రోజున డివిజన్‌స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించి సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమ నిర్వహణపై ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ 27న కార్యక్రమాన్ని ప్రారంభించి నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండాను ప్రతి ఒక్కరికీ తెలియజేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, తనను ఆశీర్వదించమని కోరడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని చెప్పారు.
ప్రజాదీవెన కోసం..
Published Thu, Oct 26 2017 11:03 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment