సాక్షి, ఏలూరు : మాజీమంత్రి, టీడీపీ మహిళా నేత పీతల సుజాత మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆర్యవైశ్య సభలో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంబికా కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై అంబికా కృష్ణ తప్పుడు ప్రచారం చేశారంటూ... బుధవారమిక్కడ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ‘బుద్ధిన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని, మంత్రి పదవి లేకున్నా... పార్టీని బలోపేతం చేస్తూంటే ...మీకు నాలో పొగరు కనిపిస్తుందా?. నన్ను అవమానించడానికా?. పార్టీని అవమానించడానికా ఈ వ్యాఖ్యలు. ప్రతి నియోజకవర్గంలోను నాయకులకు నాయకులకు మధ్య ఉన్న సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకే అంటకడతారు. అలాగే కారణం ఏదైనా నాకు టికెట్ రాలేదు అన్న విషయం అందరికి తెలిసిందే.
జంగారెడ్డిగూడెం సమావేశంలో టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకునే అంబికా కృష్ణ పార్టీ అభివృద్ధి గురించి చెప్పకుండా పీతల సుజాతను టార్గెట్ చేసి మాట్లాడతాడా?. పీతల సుజాతకు పొగరు, అహంభావం, చేతగానితనం అంటూ పాపం చేసింది కాబట్టి టికెట్ ఇవ్వలేదని మాట్లాడతారా?. నన్ను అవమానించడానికా లేక పార్టీని అవమానించడానికా?. చింతలపూడిలో పార్టీని గెలిపించడానికి ఓట్లు అడగకుండా ఓడించడానికి సొంత పార్టీపై అంబికా కృష్ణ దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక దళిత మహిళ పై తప్పుడు ఆరోపణలు చేస్తావా.
చదవండి...(దళిత నాయకురాలిపై టీడీపీ నేత అనుచిత వ్యాఖ్యలు)
నాలో ఏ పొగరు చూసారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వందల కోట్లు ఇచ్చారు. కానీ ఏ అభివృద్ధి లేదని చెప్తారా?. ఏ రోజైన నియోజకవర్గంలో పర్యటించారా అంబికా కృష్ణ?. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీలో ఉండి, అదే అధికార పార్టీ ఎమ్మెల్యేని అవమాన పరుస్తూ నియోజక వర్గంలో అభివృద్ధి జరగలేదని చెప్తే ప్రజాలేమనుకుంటారు. నాలో ఏ పాపం చూశావ్. నీలాగా సొంత బామ్మర్ది హోటల్‌ని అక్రమించుకున్ననా?. రోజు నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పాపం ఆ కుటుంబమంతా. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టే చరిత్ర నీకుంది .. నాకు లేదు. సినీ ఇండస్ట్రీలో నీ వేషాలు ఎవరికి తెలియదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇంకోసారి తనతో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే చెంప చెళ్లుమనిపిస్తా’ అంటూ పీతల సుజాత వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు తన గాడ్ ఫాదర్ అని...కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషిస్తున్నారన్నారు. ఒక ఉపాధ్యాయురాలిగా ఉన్న తనను రాజకీయాల్లోకి చంద్రబాబు తీసుకొచ్చారని, అదే నమ్మకంతో పని చేస్తూ వచ్చానన్నారు. స్థానికేతురాలు అయినప్పటికీ ముందు ఆచంట, ఆ తర్వాత చింతలపూడిలో గెలిచానని గుర్తు చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం బాధపడటం లేదని, ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఉన్న లేకపోయినా ఆఖరి వరకు నియోజకవర్గంలో కష్టపడి పనిచేశానన్నారు. టికెట్ రాకపోయినా బాధ పడలేదని, అది అధిష్టాన నిర్ణయానికి వదిలేసినట్లు చెప్పారు. కానీ కొందరు వ్యక్తులు తనపై వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పీతల సుజాత వాపోయారు.
కాగా మొన్న (సోమవారం) జంగారెడ్డి గూడెంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిధులు ఇచ్చినా పొగరు, అహంకారంతో పీతల సుజాత వాటిని ఖర్చు చేయలేదంటూ వివాదాస‍్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే పీతల సుజాతకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని విమర్శించారు. ఓటు వేసిన నియోజకవర్గ ప్రజలకు పని చేయాలనే ఇంగితజ్ఞానం కూడా పీతల సుజాతకు లేదన్నారు. మంత్రిగా ఉండి సూజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని, పాపాలు తగలకూడదనే పీతల సుజాతకు చంద్రబాబు సీటు ఇవ్వలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై పార్టీతో తీవ్ర దుమారం రేగటంతో అంబికాకృష్ణ ఎట్టకేలకు పీతల సుజాతకు క్షమాపణ చెప్పారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సొంతపార్టీ నేతలే రచ్చకెక్కడంతో ఏ మొహంతో ప్రచారానికి వెళ్లాలంటూ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment