సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘అరె, ఒక్కొక్కల ముచ్చట్లింటుంటే కడుపు మండుతంది. గిన్నాళ్లు ఎంపీల బలముండీ ఏం జెయ్యనోళ్లు గిప్పుడేమో మళ్లా అది జేస్తం, ఇదిజేత్తమంటండ్లు. కొంచెమన్న ఇసారం జేసి మాట్లాడాలే. గట్ల గాకుండా జెనాన్నీ గొర్రెలనుకుంటాండ్లేమో, నోటికచ్చినట్లు ఏదీ చెప్తే అదిని నమ్ముతలనుకుంటండ్లు లీడర్లు. మాకు దెల్వదా ఏంది’ అనుకుంట మల్లేషు కోపంల ఉన్నడు.
మంచిచెడ్డలు అర్సుకోడాన్కి గాయన దగ్గరికచ్చిన బీరయ్య, ‘ఏందన్నా గట్ల కోపం మీదున్నవేంద’ని మల్లేషునడిగిండు.
‘ఆ..నువ్వా తమ్మీ. గదేం లేదు. ఎంపీ ఎలచ్చన్లు అచ్చినయ్ గదా, గా లీడర్లు పవర్ల రానీకి పసలేని ముచ్చట్లేవేవో చెప్తాండ్లు. జెనానికేమ్ తెల్వదా ఏందీ? గాళ్ల ముచ్చట్లు నమ్మనీక’న్నడు మల్లేషు.
‘గది సరేగాని తమ్మీ ఏంది గిట్ల సడల్న వచ్చనవ’ని మల్లేషు అడ్గంగనే, బీరయ్య ‘గదే అన్నా ఎలచ్చన్ల గురించి నిన్నడిగి తెల్సుకుందమ’ని అచ్చిన్నన్నడు.
‘గట్లనా.. మన రాష్ట్రంల రాజకీయాలు మస్తు మారినయ్ తమ్మీ. ఆ పార్టీ, ఈ పార్టనే తేడ లేకుండా అన్ని పార్టోళ్లు గులాబీ కండ్వా కప్పుక్కోడాన్కి లైన్లు కడ్తాండ్లు. గిట్ల జర్గంగ సుత మేమే గెలుత్తమని కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు చెప్తుంటే కోపం రాకుంటే ఏమైతది తమ్మీ. గందుకనే జెరంత మంటమీదున్న అన్నడు మల్లేషు.
‘దేశంలున్న రాజకీయాలు పక్కన పెడ్తే మన రాష్ట్రంల గాలి ఎటుతిర్గుతంద’ని మల్లేషునడిగిండు బీరయ్య.
‘గిప్పుడైతే టీఆరెస్ పార్టీ మస్తు జోరుమీదున్నది తమ్మీ, ఎంపీ సీట్లు 16 గెల్సుకొని ఢిల్లీల చక్రం తిప్పాలనుకుంటండ్ల’న్నడు మల్లేషు.
‘గట్లనా మల్లేషన్నా. ఎలచ్చన్లు రాకముందే దేశంల ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఢిల్లీ రాజకీయాలను శాసిస్తామన్నడు గదా కేసీఆర్. గిప్పుడు గా మోకతోనే ఉన్నడ ఏంద’ని అడిగిండు బీరయ్య.
‘తమ్మీ.. గిప్పుడు దెవుసంల రాజకీయాలు మస్తు తారుమారైతనయ్. పెధానమంత్రి మోది చర్మిస్మా ఏం కనబడ్త లేదు. కాంగ్రెస్‌ల రాహుల్‌గాంధి మస్తు తండ్లాతండుగని జనం నుండి హిమ్మత్ కనిపిత్తలేదు. గట్ల గా రెండు పార్టోళ్లకు మెజార్టీ సీట్లు అచ్చేటట్టు కనిపిత్తలేవట. గందుకని టీఆరెస్ 16 సీట్లు గెల్సుకుని సత్తా చాటుతమంటండ్ల’ని ఇడమర్సి జెప్పిండు మల్లేషు.
‘మన వరంగల్ జిల్లా రాష్ట్రంల కీలకమైతదని చెప్కత్తండ్లు గదా. గట్ల జర్గుతదా అన్నా’ అని బీరయ్య అగిడేసరికి మల్లేషు ఇంకింత హుషారుగా జెప్పిండు.
‘తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు వరంగల్ జిల్లా కదా ఇతర జిల్లాలకు దారి చూపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ఉన్న వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు సుత దునియల మస్తు మంచి పేరున్నది. గతెందుకు గా స్థానాల నుంచి పెద్ద పెద్దోళ్లు పోటీల నిలబడి చరిత్ర కెక్కిండ్లు తమ్మీ’ అని ఎర్కజేసిండు మల్లేషు.
‘గట్లనా అన్నా. మరి గా రెండు స్థానాలు ఎస్సీలకు బద్లాయించుండ్లు కదా. గా సీట్లను టీఆరెసోళ్లు గెలుత్తరంటవా అన్నా’ అని బీరయ్య అనుమాన పడుకుంట అడిగిండు.
‘గందుకనే తమ్మీ ఆ రెండు సీట్లను గెల్సుకుని టీఆరెస్ పట్టు పెంచుకోనీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గా పార్టీల దిర్గేటోళ్లకు హుకుం జారీ చేసిండు. మస్తు మెజార్టీతో పోటీ చేసినోళ్లను గెలిపించుకుని రావాల్ననీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు ఎట్లెట్లా జేయాలో కేసీఆర్ ఇవరిత్తండ’ట అని అన్నడు మల్లేషు.
‘మల్లేషన్నా.. అచ్చే నెల రెండో తారీఖున వరంగల్ అజాంజాహి మిల్లుల కేసీఆర్ మీటింగుకత్తండట కదా. గక్కడ మీటింగు పెడ్తే మస్తు కల్సి అత్తదట కదా. నిజమేనా’ అని అడిగిండు బీరయ్య.
‘తమ్మీ బీరయ్య.. నువ్వన్నది ముమ్మాటికీ కరెస్టు. అక్కడ అప్పట్ల పీవీ నర్శింహారావు మీటింగు పెట్టిండు, ఆయన దేశానికి పెధానమంత్రి అయ్యిండు. గట్లనే ఈసారి కేసీర్ మీటింగు పెట్టి దేశానికి పెధానమంత్రి అయితడని చెప్కత్తండ్లు గా పార్టీ లీడర్ల’ని మల్లేషు ఇవురంగా జెప్పిండు.
‘అన్నా గట్లయితే మంచిదే గదా. మొత్తానికైతే సభ పెట్టనీకి మస్తుగా ఏర్పాట్లు జేత్తన్నరంటవ్’ అన్నడు బీరయ్య.
‘అవు తమ్మీ. సువ్ సుత మీటింగుకు రా. కేసీఆర్ ఏం చెప్తడో ఇని ఇసారం జేయ్’ అన్నడు మల్లేష్. గంతట్లనే ఇంట్ల పనుందని జెప్పి బీరయ్య ఇంటికెల్లి పోయిండు.
– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి– వరంగల్
Comments
Please login to add a commentAdd a comment